భారత్-పాక్ మ్యాచ్ రద్దు ఎఫెక్ట్.. కుదేలవుతున్న కొలంబో టూరిజం!

  • శ్రీలంక ఆర్థిక వ్యవస్థకు షాక్
  • హోటల్ బుకింగ్‌ల భారీ రద్దు
  • నష్టాల్లో విమానయాన సంస్థలు
  • ఐసీసీకి లంక బోర్డు ఫిర్యాదు?
ఈ నెల 15న కొలంబోలో జరగాల్సిన భారత్-పాక్ మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించడంతో శ్రీలంక పర్యాటక రంగం ఒక్కసారిగా ఆందోళనలో పడిపోయింది. ప్రపంచ క్రికెట్‌లో అత్యంత క్రేజ్ ఉన్న ఈ మ్యాచ్ కోసం వేలాది మంది అభిమానులు, మీడియా ప్రతినిధులు, స్పాన్సర్లు ఇప్పటికే కొలంబోకు చేరుకోవాల్సి ఉంది.

మ్యాచ్ నేపథ్యంలో కొలంబోలోని ప్రముఖ హోటళ్లన్నీ నెలల ముందే బుక్ అయ్యాయి. అయితే తాజా అనిశ్చితితో పర్యాటకులు తమ బుకింగ్‌లను రద్దు చేసుకుంటున్నారు. కేవలం హోటళ్లే కాకుండా, ప్రత్యేక విమాన సర్వీసులు, టూర్ ఆపరేటర్లు కూడా తీవ్ర నష్టాలను చవిచూసే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆర్థిక సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న శ్రీలంకకు పర్యాటక రంగమే కీలకం. ఇలాంటి మెగా టోర్నీ ద్వారా భారీ ఆదాయం వస్తుందని ఆశించిన లంకకు, పాక్ నిర్ణయం పిడుగులా మారింది. ఈ పరిణామాలపై శ్రీలంక క్రికెట్ బోర్డు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. ఆర్ధిక నష్టాల గురించి ఐసీసీ దృష్టికి తీసుకెళ్లాలని లంక అధికారులు భావిస్తున్నారు.

పాకిస్థాన్ వైఖరి మారకపోతే, ఈ మ్యాచ్ స్థానంలో వేరే కార్యక్రమాన్ని నిర్వహించాలా లేక షెడ్యూల్‌లో మార్పులు చేయాలా అనే అంశంపై ఐసీసీ తలమునకలై ఉంది. ఒకవేళ మ్యాచ్ పూర్తిగా రద్దయితే, శ్రీలంకకు జరగాల్సిన ఆదాయ నష్టాన్ని పాక్ బోర్డు నుంచి వసూలు చేసే అవకాశం కూడా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.


More Telugu News