C Ramachandraiah: రౌడీ ఎలిమెంట్స్ తో జగన్ రాజకీయ పార్టీని ఎక్కువ కాలం నడపలేరు: సి. రామచంద్రయ్య

C Ramachandraiah comments on Jagans political strategies
  • ముఖ్యమంత్రిపై అంబటి అనుచిత వ్యాఖ్యలు
  • తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్సీ రామచంద్రయ్య
  • సమర్థించుకోవడం అంబటి రాంబాబు వికృత మనస్తత్వానికి నిదర్శనమని వ్యాఖ్యలు
  • రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేసేందుకే వైసీపీ కుట్ర పన్నుతోందని ఆరోపణ
ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో గూండాలు, రౌడీలు, సంఘ విద్రోహక శక్తులతో రాజకీయ పార్టీని ఎక్కువ కాలం నడపడం సాధ్యం కాదని, ఈ విషయాన్ని జగన్ గుర్తించాలని ఆయన హితవు పలికారు.

ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఎలక్ట్రానిక్ కెమెరాల సాక్షిగా అంబటి రాంబాబు వాడిన బూతులు రికార్డు అయ్యాయని, కొన్ని ఛానెళ్లు వాటిని ప్రసారం చేసినప్పుడు సభ్య సమాజం నిర్ఘాంతపోయిందని రామచంద్రయ్య పేర్కొన్నారు. ఆవేశంలో నోరు జారానని చెప్పి ఉంటే అర్థం ఉండేదని, కానీ చేసిన తప్పును సమర్థించుకునేలా మాట్లాడటం అంబటి రాంబాబు వికృత మనస్తత్వానికి నిదర్శనమని విమర్శించారు.

గత కొంతకాలంగా వైసీపీకి చెందిన కొందరు నేతలు అడ్డూ అదుపు లేకుండా మాట్లాడుతున్నారని రామచంద్రయ్య ఆరోపించారు. చట్టం, రాజ్యాంగం తమకు వర్తించవన్న ధోరణితో వ్యవహరిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తున్నారని మండిపడ్డారు. తద్వారా రాష్ట్రానికి వస్తున్న ప్రతిష్ఠను దెబ్బతీసి, పెట్టుబడులు రాకుండా అడ్డుకోవాలని కుట్ర పన్నుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.

రాజకీయ ప్రత్యర్థులను అడ్డంగా నరుకుతామంటూ వారి పార్టీ నేతలు చేస్తున్న సవాళ్లను, అసభ్య పదజాలాన్ని జగన్ ప్రోత్సహించే విధంగా ప్రవర్తించడం అత్యంత దారుణమని రామచంద్రయ్య ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ తన వైఖరి మార్చుకోకపోతే, ప్రజలే తగిన రీతిలో బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. ఈ తరహా రాజకీయాలు ఎక్కువ కాలం చెల్లవని స్పష్టం చేశారు.


C Ramachandraiah
Chandrababu Naidu
Ambati Rambabu
YSRCP
Jagan Mohan Reddy
Andhra Pradesh Politics
Rowdy elements
Political criticism
Telugu News
Political party

More Telugu News