మటన్ ఆర్డర్ ఇస్తే బీఫ్ వడ్డించాడు... అరెస్టయ్యాడు!

  • కొల్‌కతాలో మటన్‌కు బదులు బీఫ్ సర్వ్ చేసిన ఘటన
  • తాను బ్రాహ్మణుడినని, మత విశ్వాసాలు దెబ్బతిన్నాయని నటుడి ఆవేదన
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో, రాజకీయంగా మారిన వివాదం
నగరంలోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌లో మటన్ ఆర్డర్ చేసిన కస్టమర్‌కు బీఫ్ సర్వ్ చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. బాధితుడైన నటుడు, యూట్యూబర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ రెస్టారెంట్ వెయిటర్‌ను అరెస్ట్ చేశారు. ఈ ఘటన కొల్‌కతాలోని పార్క్ స్ట్రీట్‌లో ఉన్న ప్రసిద్ధ 'ఓలీ పబ్'లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే, టాలీవుడ్ నటుడు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన సయక్ చక్రబర్తి శుక్రవారం రాత్రి తన స్నేహితులతో కలిసి ఓలీ పబ్‌కు వెళ్లారు. అక్కడ వారు మటన్ స్టీక్ ఆర్డర్ చేశారు. అయితే, వెయిటర్ పొరపాటున వారికి బీఫ్ స్టీక్ తీసుకొచ్చి వడ్డించాడు. అది మటన్ అనే భావనతో వారు తినేశారు. కాసేపటి తర్వాత సిబ్బంది అసలు విషయం చెప్పడంతో ఈ పొరపాటు వెలుగులోకి వచ్చింది.

దీంతో ఆగ్రహానికి గురైన సయక్, అక్కడే వీడియో తీస్తూ వెయిటర్‌ను నిలదీశారు. "నేను బ్రాహ్మణుడిని, నాకు బీఫ్ సర్వ్ చేశారు. ఇదే ఒకవేళ మీరు ముస్లిం అయితే పంది మాంసం తినగలరా?" అంటూ ప్రశ్నించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వెయిటర్ తన తప్పును అంగీకరించినప్పటికీ, సయక్ శాంతించలేదు.

అనంతరం సయక్ పార్క్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు, శనివారం ఆ వెయిటర్‌ను అరెస్ట్ చేశారు. ఇది నిర్లక్ష్యంగా జరిగిందా లేక ఉద్దేశపూర్వకంగా జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా, బీజేపీ నేతలు కొందరు ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నమని ఆరోపిస్తున్నారు.


More Telugu News