బడ్జెట్: 75 ఏళ్ల సంప్రదాయానికి నిర్మలా సీతారామన్ బ్రేక్!

  • గత బడ్జెట్‌లలో పార్ట్ 'ఏ'లో  అనేక అంశాలు 
  • పన్ను, విధాన ప్రకటనలకు పరిమితమైన పార్ట్ 'బీ'
  • స్వల్పకాలిక ప్రాధాన్యతలు, దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఈసారి పార్ట్ 'బీ'
తొమ్మిదవసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, 75 సంవత్సరాల సంప్రదాయానికి ముగింపు పలకనున్నారు. భారతదేశ ఆర్థిక భవిష్యత్తుకు సంబంధించి వివరణాత్మక దృక్పథాన్ని ఆవిష్కరించడానికి నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలోని పార్ట్ 'బి'ని ఉపయోగించుకోనున్నారు.

గత కేంద్ర బడ్జెట్‌లలో చాలా విషయాలు పార్ట్ 'ఏ'లో ఉండగా, పార్ట్ 'బి'ని పన్ను, విధాన ప్రకటనలకు పరిమితం చేశారు. ఈసారి భారత్ 21 శతాబ్దం రెండవ త్రైమాసికంలోకి అడుగుపెడుతున్న సమయంలో, పార్ట్ 'బి' స్వల్పకాలిక ప్రాధాన్యతలు, దీర్ఘకాలిక లక్ష్యాలను వివరిస్తుందని, భారత స్థానిక బలాలు, ప్రపంచ ఆశయాలను హైలెట్ చేస్తుందని తెలుస్తోంది.

నిర్మలా సీతారామన్‌కు ఇది తొమ్మిదవ బడ్జెట్. 2019లో మొదటిసారి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు లెదర్ బ్రీఫ్ కేసును ఎరుపు వస్త్రంతో చుట్టిన సాంప్రదాయ పద్ధతిలో బడ్జెట్ పత్రాలను సభకు తీసుకువచ్చారు. గత నాలుగేళ్లుగా కాగిత రహిత బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు.

కాగా, సాధారణంగా కేంద్ర బడ్జెట్‌లో పార్ట్ 'ఏ', పార్ట్ 'బీ' ఉంటాయి. పార్ట్ 'ఏ' ప్రభుత్వ వ్యయ ప్రణాళికలు, మౌలిక సదుపాయాలు, వివిధ రంగాలకు కేటాయింపులు వివరిస్తుంది. పార్ట్ 'బి' ఆదాయ మార్గాలు, ప్రధానంగా ప్రత్యక్ష, పరోక్ష పన్నుల్లో మార్పులు, సవరణలు తెలియజేస్తుంది.


More Telugu News