ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేను ఆరెస్సెస్ భావజాలం ఆవహించి ఉంటుంది: అసదుద్దీన్ ఒవైసీ

  • ఆ వ్యాఖ్యలు కౌశిక్ రెడ్డికి ఉన్న ద్వేషాన్ని బయటపెట్టాయన్న అసదుద్దీన్
  • కేసీఆర్ నాయకత్వంలోని పార్టీ ఎమ్మెల్యే నుంచి ఇలాంటి వ్యాఖ్యలు శోచనీయమని వ్యాఖ్య
  • బీఆర్ఎస్ అధిష్ఠానం ఈ వ్యాఖ్యలపై ఆలోచన చేయాలని సూచన
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర విమర్శలు చేశారు. విధి నిర్వహణలో ఉన్న అధికారిపై మతం పేరుతో వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. ఐపీఎస్ అధికారిని ఉద్దేశించి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ముస్లింల పట్ల ఆయనకున్న ద్వేషాన్ని బయటపెట్టాయని అన్నారు.

మొదటిసారి ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే, ఆయనను ఆరెస్సెస్ భావజాలం ఆవహించి ఉంటుందని చురక అంటించారు. పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్‌లో ఉంటూ కౌశిక్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం శోచనీయమని అన్నారు. ఆయన వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తిని ఉప ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా చేశారని గుర్తు చేశారు.

త్వరలో జరగనున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలపై కూడా అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. తమ పార్టీ అభ్యర్థులను మేయర్, డిప్యూటీ మేయర్, ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌లుగా గెలిపించుకోవడమే లక్ష్యమని అన్నారు. ఇందులో భాగంగా తాండూరు నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించినట్లు చెప్పారు.


More Telugu News