ఉప ముఖ్యమంత్రిగా సునేత్రా పవార్ ప్రమాణ స్వీకారం.. తొలి మహిళగా చరిత్ర

  • ముంబైలోని లోక్ భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్
  • ఫడ్నవీస్, ఏక్‌నాథ్ షిండే సమక్షంలో ప్రమాణం
  • సునేత్రాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
రాజ్యసభ ఎంపీ సునేత్రా పవార్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రంలో ఆ పదవి వరించిన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. ముంబైలోని లోక్‌భవన్‌లో, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సమక్షంలో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ఆమెతో ప్రమాణం చేయించారు.

సునేత్రా పవార్ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం లోక్ భవన్‌లో 'అజిత్ దాదా అమర్ రహే' అంటూ నినాదాలు ప్రతిధ్వనించాయి. సునేత్రా పవార్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. అజిత్ పవార్ దార్శనికతను సునేత్రా నెరవేరుస్తారని ఆయన ఆకాంక్షించారు.

"మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన, ఈ బాధ్యతను చేపట్టిన మొదటి మహిళ సునేత్రా పవార్ జీకి శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఆమె అవిశ్రాంతంగా పనిచేస్తారని మరియు దివంగత అజిత్‌దాదా పవార్ దార్శనికతను నెరవేరుస్తారని నేను విశ్వసిస్తున్నాను" అని ప్రధాని మోదీ 'ఎక్స్'లో చేసిన పోస్టులో పేర్కొన్నారు.

కాగా, ఇటీవల బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం చెందారు. దీనితో ఆ పార్టీ శాసనసభా పక్ష నేతగా ఆయన భార్య సునేత్రా పవార్‌ను ఎన్సీపీ వర్గాలు ఎన్నుకున్నాయి. దీంతో ఆమె ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.


More Telugu News