ఇంటి గోడపై నోటీసు అతికించడమా?: జూబ్లీహిల్స్ ఏసీపీకి కేసీఆర్ లేఖ

  • విచారణకు హాజరు కావడానికి చట్ట ప్రకారం నోటీసులు ఇవ్వలేదన్న కేసీఆర్
  • నోటీసు అంటించడం ద్వారా గౌరవానికి భంగం కలిగించారని పేర్కొన్న కేసీఆర్
  • బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానన్న కేసీఆర్
జూబ్లీహిల్స్ ఏసీపీకి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లేఖ రాశారు. విచారణకు హాజరయ్యేందుకు తనకు చట్ట ప్రకారం నోటీసులు ఇవ్వలేదని ఆ లేఖలో పేర్కొన్నారు. నంది నగర్‌లోని తన ఇంటికి నోటీసు అంటించడం ద్వారా తన గౌరవానికి భంగం కలిగించారని పేర్కొన్నారు.

బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని అన్నారు. ఫిబ్రవరి 1 మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు సిద్ధమని తెలిపారు. నందినగర్‌లో తన నివాసం గోడపై నోటీసు అతికించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధమని లేఖలో పేర్కొన్నారు. 65 ఏళ్లు దాటిన వారిని వారి నివాసం వద్దనే విచారించాలని చట్టం చెబుతోందని గుర్తు చేశారు.

తన ప్రస్తుత నివాసం ఎర్రవల్లిలో ఉందని, అక్కడే విచారించాలని ఆ లేఖలో స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఏసీపీకి తనను విచారించే అధికార పరిధి లేదని, నోటీసుల జారీలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పోలీసులు ఉల్లంఘించారని ఆరోపించారు. ఎన్నికల అఫిడవిట్‌లోని చిరునామాకు, సెక్షన్ 160 నోటీసులకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం నివసిస్తున్న చోట విచారణ జరపాలని పార్లమెంట్ చట్టం చెబుతోందని అన్నారు.

ఇక, హరీశ్ రావుకు నోటీసుల విషయంలో పోలీసులు రెండు నాల్కల ధోరణి పాటిస్తున్నారని ఆ లేఖలో విమర్శించారు. పోలీసుల తీరు కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని కేసీఆర్ అన్నారు. నంది నగర్ నివాసంలోనే విచారణకు అందుబాటులో ఉంటానని కేసీఆర్ స్పష్టం చేశారు. అక్రమ పద్ధతిలో ఇచ్చిన నోటీసులను తాను విస్మరించవచ్చని, కానీ బాధ్యతాయుత పౌరుడిగా విచారణకు హాజరవుతానని అన్నారు.

భవిష్యత్తులో నోటీసులన్నింటినీ ఎర్రవల్లిలోని తన చిరునామాకే పంపించాలని పోలీసులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోని 'వీడీ మూర్తి' కేసు తీర్పును లేఖలో కేసీఆర్ ప్రస్తావించారు. పోలీసుల చర్యలు తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.


More Telugu News