ఆత్మహత్యకు ముందు తల్లితో మాట్లాడాలని చెప్పిన బెంగళూరు రియల్ ఎస్టేట్ టైకూన్ సీజే రాయ్

  • కాన్ఫిడెంట్ గ్రూప్ చైర్మన్ సీజే రాయ్ ఆత్మహత్య
  • ఐటీ రెయిడ్స్ జరుగుతున్న సమయంలో తన క్యాబిన్‌లో తుపాకీతో కాల్చుకున్న రాయ్
  • పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలన్న రాయ్ కంపెనీ ఎండీ జోసెఫ్

ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ కాన్ఫిడెంట్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ సీజే రాయ్ బెంగళూరులోని తన ఆఫీసులో ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఆయనపై ఆదాయపు పన్ను శాఖ రైడ్స్, విచారణ జరుగుతున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది.


రాయ్ ఆఫీసులో ఐటీ అధికారులు డాక్యుమెంట్లపై విచారణ చేస్తుండగా, ఆయన తన కార్యాలయ క్యాబిన్‌లోకి వెళ్లి తలుపు లాక్ చేసుకున్నారు. ఆ తర్వాత తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కొంతసేపటి తర్వాత క్యాబిన్ లోపలి నుంచి స్పందన లేకపోవడంతో సిబ్బంది తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్లగా రాయ్ కుర్చీలో రక్తసిక్తంగా ఉన్నారు. హుటాహుటిన ఆయనను హెచ్ఎస్ఆర్ లేఔట్ లోని నారాయణ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయారని వైద్యులు నిర్ధారించారు.


ఈ ఘటనకు ముందు రాయ్ తన కంపెనీ ఎండీ టీఏ జోసెఫ్‌తో కలిసి ఆఫీసుకు వచ్చారు. విచారణ మధ్యలో, తన తల్లితో మాట్లాడాలని చెప్పి క్యాబిన్‌లోకి వెళ్లారు. ఆ తర్వాత సెక్యూరిటీ సిబ్బందికి “ఎవరినీ లోపలికి రానివ్వవద్దు” అని సూచించారు.


డిసెంబరు మొదటి వారంలో రాయ్ సంస్థలపై ఐటీ రైడ్స్ జరిగాయి. గత కొన్ని రోజులుగా సీజ్ చేసిన డాక్యుమెంట్లపై విచారణ జరుగుతోంది. రాయ్ కేరళలో ముందు విచారణకు హాజరయ్యారు. దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత బెంగళూరులో ఎప్పుడైనా అందుబాటులో ఉంటానని అధికారులకు తెలిపారు. గత గురువారం రాయ్ సంస్థలపై మళ్లీ రైడ్స్ జరిగాయి. ఆదాయాల కంటే అధికంగా ఆస్తులు ఉన్నట్లు రైడ్స్‌లో బయటపడిందని సమాచారం.


కాన్ఫిడెంట్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ టీఏ జోసెఫ్ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాయ్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై పూర్తి దర్యాప్తు జరగాలని కోరారు. బెంగళూరు పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ ఈ ఘటన మధ్యాహ్నం 3 నుంచి 3.30 గంటల మధ్య జరిగిందని తెలిపారు. కేరళ నుంచి వచ్చిన ఐటీ టీమ్ గత మూడు రోజులుగా రాయ్ ఆఫీసుల్లో రైడ్స్ నిర్వహించి విచారణ చేస్తోందని చెప్పారు. 


కాన్ఫిడెంట్ గ్రూప్ దక్షిణ భారతదేశంలో అనేక ప్రాజెక్టులు చేపట్టిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ. ఇది మలయాళ బిగ్ బాస్ రియాలిటీ షోకు కొన్ని సీజన్లకు టైటిల్ స్పాన్సర్ కూడా.



More Telugu News