గుంటూరులో అంబటి నివాసం వద్ద ఉద్రిక్తత... పోలీసు బందోబస్తు!

  • చంద్రబాబుపై అంబటి బూతులతో విరుచుకుపడిన వైనం
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు
  • అంబటిని అరెస్ట్ చేస్తారంటూ ఊహాగానాలు!
గుంటూరులో సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబును బూతులతో దూషించిన నేపథ్యంలో, టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఆయనను అరెస్ట్ చేయబోతున్నారనే వదంతులు  వ్యాపించడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. ఈ ప్రచారంతో గుంటూరులోని నవభారత్ నగర్ లో ఉన్న అంబటి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించి, భద్రతను కట్టుదిట్టం చేశారు.

ప్రస్తుతం అంబటి రాంబాబు గుంటూరులోని తన నివాసంలోనే ఉన్నారు. ఆయనపై ఉన్న పలు ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ ఖాయమంటూ సోషల్ మీడియాలో, స్థానికంగా ప్రచారం జోరందుకుంది. ఈ సమాచారంతో వైసీపీ కార్యకర్తలు, ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు అప్రమత్తమై అంబటి నివాసానికి వెళ్లే మార్గాలను బారికేడ్లతో మూసివేశారు. మీడియా ప్రతినిధులతో సహా ఎవరినీ ఆ ప్రాంతంలోకి అనుమతించడం లేదు. పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.




More Telugu News