రాజకీయాల్లోకి రావడం వల్లే నా సినిమాను ఇబ్బందులకు గురిచేస్తున్నారు: నటుడు విజయ్

  • 'జన నాయగన్' చిత్రం విడుదల ఆలస్యం కావడంపై స్పందించిన టీవీకే అధినేత
  • తన కారణంగా నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారన్న విజయ్
  • నా సినిమాపై ప్రభావం పడుతుందని ముందే ఊహించానని వ్యాఖ్య
తాను నటించిన 'జన నాయగన్' చిత్రం విడుదల ఆలస్యం కావడంపై నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ స్పందించారు. తాను రాజకీయాల్లోకి రావడం వల్లే తన సినిమాను ఇలా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తన కారణంగా నిర్మాతకు నష్టం జరుగుతోందని అన్నారు.

తన నిర్మాతల గురించి ఆలోచిస్తే బాధగా ఉందని అన్నారు. రాజకీయ రంగంలోకి వచ్చేటప్పుడు వీటన్నింటికి సిద్ధపడ్డానని ఆయన పేర్కొన్నారు. తన సినిమాపై ఈ ప్రభావం పడుతుందని ముందే ఊహించానని అన్నారు.

వాస్తవానికి ఈ చిత్రం డిసెంబర్ 9న విడుదల కావాల్సింది. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డుకు అదే తేదీన మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సీబీఎఫ్‌సీ మద్రాసు హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. సెన్సార్ సర్టిఫికెట్ జారీపై న్యాయస్థానం తాత్కాలికంగా స్టే విధించగా, నిర్మాణ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

సినిమా విడుదల విషయంలో జోక్యానికి నిరాకరించిన సుప్రీంకోర్టు, మద్రాస్ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించాలని నిర్మాతలకు సూచించింది. ఈ నెల 21న సుదీర్ఘ వాదనల అనంతరం డివిజన్ బెంచ్ తీర్పును రిజర్వ్ చేసింది. సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వాలని సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసిన డివిజన్ బెంచ్, దీనిపై విచారణ జరపాలని ఆదేశించింది.


More Telugu News