పాకిస్థాన్ లోని బలోచిస్థాన్ లో పలు ప్రాంతాల్లో దాడులు

  • బీఎల్ఏ దాడుల్లో నలుగురు పోలీసుల మృతి
  • దాడులు తామే చేశామన్న బలోచ్ లిబరేషన్ ఆర్మీ
  • స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న బలోచ్ ప్రజలు

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఈరోజు ఒకేసారి పలు ప్రాంతాల్లో దాడులు జరిగాయి. భద్రతా శాఖలు, ప్రభుత్వ కేంద్రాలపై దాడులు జరిగాయి. ఈ దాడుల్లో కనీసం నలుగురు పోలీసులు మరణించారు. బలూచ్ విభజనవాద సంస్థ బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ఈ దాడులకు బాధ్యత తీసుకుంది. 


ఈ దాడుల గురించి క్వెట్టాలోని ఒక సీనియర్ భద్రతా అధికారి మాట్లాడుతూ, దాడులు ఒకేసారి జరిగాయని... గన్‌ఫైర్, సూసైడ్ బాంబింగ్‌లు జరిగాయని తెలిపారు. క్వెట్టాలోనే నలుగురు పోలీసులు మరణించారని ఆయన వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితి అస్థిరంగా ఉందని, పూర్తిగా నియంత్రణలోకి రాలేదని తెలిపారు.


సైనిక శిబిరాలు, పోలీసు యూనిట్లు, ప్రభుత్వ అధికారులపై దాడులు జరిగాయని, బలూచ్ ప్రావిన్స్‌కు స్వయం పాలన కోసం జరుగుతున్న పోరాటంలో భాగమే ఈ దాడులు అని బలోచ్ ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. బలూచిస్థాన్ అనేది... అఫ్ఘనిస్థాన్, ఇరాన్ సరిహద్దుల్లో ఉన్న ఖనిజ సంపదలు కలిగిన ప్రాంతం. గత కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ విభజనవాద ఉద్యమం కొనసాగుతోంది. తమ ప్రాంతీయ వనరులను పాక్ ప్రభుత్వం దోచుకుంటోందని... తమకు స్వాతంత్ర్యం కావాలని బలోచ్ ఆర్మీ డిమాండ్ చేస్తోంది. గత కొంత కాలంగా పాక్ ఆర్మీపై బలోచ్ ఆర్మీ దాడులు ఎక్కువయ్యాయి. మరో విషయం ఏమిటంటే... పాక్ నుంచి స్వాతంత్ర్యం పొందేందుకు భారత్ తమకు సహకారం అందించాలని బలోచ్ పౌరులు కోరుతున్నారు.



More Telugu News