ఆనందపూర్ లో ఘోర అగ్ని ప్రమాదం.. మమతా బెనర్జీపై అమిత్ షా ఫైర్

  • ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం
  • 21కి చేరుకున్న మరణాల సంఖ్య
  • మమత ప్రభుత్వ అవినీతి వల్లే విషాదం జరిగిందన్న అమిత్ షా

పశ్చిమ బెంగాల్‌లోని ఆనందపూర్ వద్ద గోదాముల్లో జరిగిన భయంకర అగ్నిప్రమాదంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు గుప్పించారు. మమతా బెనర్జీ ప్రభుత్వ అవినీతి వల్లే ఈ విషాదం జరిగిందని, పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి నిందితులను జైలుకు పంపాలని ఆయన డిమాండ్ చేశారు.


ఉత్తర 24 పరగణాల జిల్లాలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ... "ఆనందపూర్‌లోని మోమో ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాదం విషాదకరం. ఇది ప్రమాదం కాదు... మమతా బెనర్జీ ప్రభుత్వ అవినీతి దీనికి కారణం. మోమో ఫ్యాక్టరీలో ఎవరి డబ్బు పెట్టారు? యజమాని ఎవరితో విదేశీ ఫ్లైట్‌లో వెళ్లాడు? ఎందుకు అరెస్ట్ చేయలేదు?" అని ప్రశ్నించారు.


అగ్నిప్రమాదం జరిగి 32 గంటల తర్వాత మంత్రి స్థలానికి చేరుకున్నారని, కార్మికులు అరుస్తుంటే ప్రభుత్వం నిశ్శబ్దంగా ఉందని ఆయన మండిపడ్డారు. "ఈ అగ్నిప్రమాదం మీ పార్టీ అవినీతిని చూపిస్తోంది" అని అమిత్ షా ఆరోపించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పూర్తి దర్యాప్తుకు ఆదేశించి నిందితులను జైలుకు పంపాలని డిమాండ్ చేశారు.


ప్రమాదం వివరాల్లోకి వెళితే... ఆనందపూర్‌లోని డెకరేటర్ గోదాములో మొదలైన మంటలు సమీపంలోని మోమో గోదాముకు వ్యాపించాయి. 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ గోదాములో ప్యాకేజింగ్ మెటీరియల్, బెవరేజెస్, ఇతర సామాన్లు నిల్వ ఉన్నాయి. అగ్నిప్రమాదం సమయంలో చాలా మంది కార్మికులు నిద్రపోయి ఉండటంతో వారు తప్పించుకోలేకపోయారు. మరణాల సంఖ్య 21కి చేరుకుంది. ఇంకా శవాలు శిథిలాల కింద ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు.

పోలీసులు 16 మంది బంధువుల నుంచి డీఎన్ఏ శాంపిల్స్ సేకరించారు. అనేకమంది కుటుంబ సభ్యులు తమ వారు ఇంకా శిథిలాల కింద ఉన్నారేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, గోదాములో ఫైర్ సేఫ్టీ గైడ్‌లైన్స్ ఎలా ఉన్నాయి అనే అంశంపై కూడా దర్యాప్తు జరుగుతోంది. 


ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఘటనా స్థలానికి వెళ్లి నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే ఈ విషాదానికి బాధ్యులని ఆయన ఆరోపించారు.



More Telugu News