Epstein Files: ఎప్ స్టీన్ ఫైల్స్ లో న్యూయార్క్ మేయర్ తల్లి పేరు..!

Meera Nair at Ghislaine Maxwell Party Epstein Files Reveal
  • ఎప్ స్టీన్ కు రాసిన ఈ–మెయిల్ లో మీరా నాయర్ పేరు ప్రస్తావించిన పెగ్గీ సీగల్
  • అమేలియా సినిమా విడుదల నేపథ్యంలో పార్టీ ఏర్పాటు చేసిన గిస్లెయిన్ మాక్స్ వెల్
  • ఆ పార్టీలో ఎవరెవరు పాల్గొన్నారనే వివరాలతో సీగల్ ఈ–మెయిల్
అమెరికాను కుదిపేస్తున్న ఎప్ స్టీన్ ఫైల్స్ లో తాజాగా మరికొందరి పేర్లు బయటపడ్డాయి. డిపార్ట్ మెంట్ ఆఫ్ జస్టిస్ శుక్రవారం 2 వేల వీడియోలు, 1.8 లక్షల ఫొటోలు సహా మొత్తం 30 లక్షలకు పైగా డాక్యుమెంట్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులోని ఓ ఈ–మెయిల్ లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2009లో అమేలియా సినిమా రిలీజ్ సందర్భంగా జరిగిన ఓ పార్టీలో ఆ సినిమా దర్శకురాలు, న్యూయార్క్ ప్రస్తుత మేయర్ జొహ్రాన్ మందానీ తల్లి మీరా నాయర్ కూడా పాల్గొన్నారని ఓ ఈ–మెయిల్ వెల్లడించింది. ఈ పార్టీని ట్రాఫికింగ్ కేసులో దోషిగా తేలిన గిస్లెయిన్ మాక్స్ వెల్ తన నివాసంలో ఏర్పాటు చేసినట్లు వెల్లడైంది. ఈ పార్టీకి హాజరైన పెగ్గీ సీగల్ 2009 అక్టోబర్ 21న జెఫ్రీ ఎప్ స్టీన్ కు ఓ ఈ–మెయిల్ పంపారు.

‘‘మాక్స్ వెల్ నివాసంలో జరిగిన పార్టీ నుంచి ఇప్పుడే బయటకు వచ్చాను. అమేలియా సినిమా రిలీజ్ సందర్భంగా మాక్స్ వెల్ తన ఇంట్లో ఈ పార్టీ ఏర్పాటు చేశారు. మాజీ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్, అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్, జియాన్ పిగొని, డైరెక్టర్ మీరా నాయర్.. తదితరులు ఈ పార్టీకి హాజరయ్యారు. సినిమా పెద్దగా ఆకట్టుకునేలా లేదని అతిథులు అభిప్రాయపడ్డారు. అయితే, మహిళలను మాత్రం ఈ సినిమా చాలా ఆకట్టుకుంది” అంటూ పెగ్గీ సీగల్ పలు వివరాలను ఇందులో పేర్కొన్నాడు.
Epstein Files
Meera Nair
Jeffrey Epstein
Bill Clinton
Ghislaine Maxwell
Zohran Mamdani
Amelia Movie
Peggy Siegal
New York Mayor
Jeff Bezos

More Telugu News