మేడారం జాతర: గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క.. జనసంద్రంగా మారిన వనం

  • వైభవంగా సమ్మక్క గద్దె చేరే ఘట్టం.. పోటెత్తిన భక్తజనం
  • వివిధ రాష్ట్రాల నుంచి పోటెత్తిన లక్షలాది భక్తులు
  • వనదేవతలకు మొక్కులు చెల్లించిన బ్రిటిష్ అధికారి
  • పటిష్ట ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా సాగుతున్న జాతర
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర మూడో రోజైన శుక్రవారం పతాకస్థాయికి చేరింది. వనదేవత సమ్మక్క తల్లి గద్దెపై కొలువుదీరడంతో మేడారం ప్రాంగణం భక్తులతో జనసంద్రంగా మారింది. లక్షలాది మంది భక్తులు భక్తిపారవశ్యంతో అమ్మవార్లను దర్శించుకుంటున్నారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ సహా పలు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులతో మేడారం కిక్కిరిసిపోయింది. ఆలయ పరిసరాలు, జంపన్న వాగు భక్తులతో నిండిపోయాయి. అమ్మవార్ల దర్శనం కోసం భక్తులు కిలోమీటర్ల పొడవునా బారులు తీరారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వ యంత్రాంగం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. జాతర ప్రశాంతంగా సాగుతోందని అధికారులు తెలిపారు.

ఈ జాతరకు ప్రముఖుల తాకిడి కూడా కొనసాగుతోంది. హైదరాబాద్‌లోని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ శుక్రవారం మేడారం సందర్శించి, సంప్రదాయ వస్త్రధారణలో తులాభారం మొక్కు చెల్లించుకున్నారు. మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ ఆయనకు జాతర ప్రాశస్త్యాన్ని వివరించారు. వీరితో పాటు తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రులు కొండా సురేఖ, భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, జువల్ ఓరం అమ్మవార్లను దర్శించుకున్నారు.

జాతరలో అత్యంత కీలకమైన ఘట్టం గురువారం రాత్రి జరిగింది. చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లిని గిరిజన సంప్రదాయాల నడుమ మేడారంలోని గద్దెపైకి తీసుకొచ్చారు. సమ్మక్క తల్లి ప్రయాణం ప్రారంభమవగానే, జిల్లా ఎస్పీ గాలిలోకి కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. అర్ధరాత్రి దాటాక సమ్మక్క తల్లి గద్దెపైకి చేరారు. ఇప్పటికే సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపై కొలువుదీరగా, సమ్మక్క తల్లి కూడా చేరడంతో భక్తులు వనదేవతలను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు.
.


More Telugu News