ఆయన భార్య అందంగా ఉంటుంది... అందుకే ఆయనకు పదవిని ఇచ్చా: ట్రంప్

  • అమెరికా ఇంటీరియర్ సెక్రటరీగా డగ్ బర్గమ్ ను నియమించిన ట్రంప్
  • బర్గమ్ భార్య క్యాథరిన్ ఆకర్షణీయంగా ఉంటారని వ్యాఖ్య
  • ట్రంప్ పై వెల్లువెత్తుతున్న విమర్శలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసే వ్యాఖ్యలు ఒక్కోసారి చాలా విచిత్రంగా ఉంటాయి. తాను ఏం మాట్లాడినా చెల్లుతుంది అనే విధంగా ఆయన వ్యాఖ్యలు చేస్తుంటారు. తాజాగా ఇలాంటి సన్నివేశమే మరోసారి చోటుచేసుకుంది. అమెరికా ఇంటీరియర్ సెక్రటరీగా డగ్ బర్గమ్ ను ట్రంప్ నియమించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ, బర్గమ్ భార్య చాలా అందంగా ఉంటుందని... అందుకే ఆయనకు పదవి ఇచ్చానని అన్నారు. ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో బర్గమ్, ఆయన భార్య ఇద్దరూ అక్కడే ఉండటం గమనార్హం.

బర్గమ్, ఆయన భార్య క్యాథరిన్ గుర్రపు స్వారీ చేస్తున్న వీడియోను తాను చూశానని... ఆ వీడియోలో ఆమె ఎంతో ఆకర్షణీయంగా కనిపించారని ట్రంప్ అన్నారు. ఆమె ఎవరని తన సిబ్బందిని తాను అడిగానని... ఈ జంట గురించి వారు తనకు వివరించగానే, తనకు ఒక అభిప్రాయం ఏర్పడిందని చెప్పారు. ఆ కారణంతోనే బర్గమ్ కు పదవిని ఇచ్చానని తెలిపారు. బర్గమ్ విజయవంతమైన బిజినెస్ మ్యాన్ అని చెప్పారు. రెండుసార్లు నార్త్ డకోటాకు గవర్నర్ గా చేశారని... ఆయన విజయం వెనుక ఆయన భార్య పాత్ర ఉంటుందని... వీరు అద్భుతమైన జంట అని అన్నారు. 

క్యాథరిన్ గురించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. మహిళలను కించపరిచేలా ఆయన మాటలు ఉన్నాయంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో కూడా మహిళలపై పలుమార్లు ట్రంప్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.


More Telugu News