నెల రోజుల్లోపే ఓటీటీలోకి ‘ది రాజాసాబ్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే..?

  • ఫిబ్రవరి 6 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్
  • భారీ ధరకు డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న ఓటీటీ సంస్థ
  • తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అందుబాటులోకి
టాలీవుడ్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా, దర్శకుడు మారుతి రూపొందించిన హారర్ కామెడీ చిత్రం 'ది రాజాసాబ్' ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 9న‌ థియేటర్లలోకి వచ్చి మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ హారర్ కామెడీ చిత్రం, విడుదలైన నెల రోజుల లోపే డిజిటల్ స్ట్రీమింగ్‌కు రానుండటం గమనార్హం. ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్‌స్టార్ ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను అత్యంత భారీ ధరకు సొంతం చేసుకుంది.

ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 'ది రాజాసాబ్' తమ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంటుందని సంస్థ‌ అధికారికంగా ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లోనూ ఈ సినిమాను వీక్షించవచ్చు. థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినప్పటికీ, ప్రభాస్‌ను వింటేజ్ లుక్‌లో చూడాలనుకునే అభిమానుల కోసం ఈ చిత్రం ఓటీటీలో వినోదాన్ని పంచేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ కీలక పాత్రల్లో నటించారు.

ఇక సినిమా కథ విషయానికొస్తే.. మతిమరుపు (ఆల్జీమర్స్) వ్యాధితో బాధపడే తన నాయనమ్మ (జరీనా వహాబ్) కోసం, ఆమెను విడిచి వెళ్లిపోయిన భర్త కనకరాజు (సంజయ్ దత్)ను వెతకడానికి మనవడు రాజాసాబ్ (ప్రభాస్) బయలుదేరతాడు. తన తాత ఓ పాడుబడిన రాజమహల్‌లో ఉన్నాడని తెలుసుకుని అక్కడికి వెళ‌తాడు. ఆ మహల్‌లో అతనికి ఎదురైన విచిత్ర అనుభవాలు, తన తాత గురించి తెలిసిన సంచలన నిజాలు ఏంటనేదే ఈ సినిమా కథాంశం. నాయనమ్మ కోసం రాజాసాబ్ చేసిన పోరాటమే ఈ హారర్ కామెడీ చిత్రానికి ప్రధాన ఆకర్షణ.


More Telugu News