భార్యను పొగిడిన ట్రంప్.. 'మెలానియా' డాక్యుమెంటరీపై చెలరేగిన దుమారం

  • అమెరికా ప్రథమ మహిళపై 'మెలానియా' డాక్యుమెంటరీ ప్రీమియర్
  • 40 మిలియన్ డాలర్ల భారీ బడ్జెట్‌తో నిర్మాణంపై విమర్శలు
  • ట్రంప్ సర్కార్‌ను ప్రసన్నం చేసుకునేందుకే అమెజాన్ ప్రమోషన్ అని ఆరోపణలు
  • పెయిడ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన మెలానియా ట్రంప్
  • కొన్నిసార్లు నేను అదుపుతప్పినా ఆమె సంయమనంతో ఉంటుందని ట్రంప్ వ్యాఖ్య
అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ జీవితం ఆధారంగా తెరకెక్కిన 'మెలానియా' డాక్యుమెంటరీ ప్రీమియర్ వాషింగ్టన్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన అర్ధాంగి మెలానియాతో పాటు పలువురు ఉన్నతాధికారులు, అమెజాన్ సీఈవో ఆండీ జాస్సీ వంటి టెక్ దిగ్గజాలు హాజరయ్యారు. అయితే, ఈ డాక్యుమెంటరీ ఇప్పుడు అమెరికాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీని భారీ బడ్జెట్, నిర్మాణంలో మెలానియా పాత్రపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ డాక్యుమెంటరీ నిర్మాణానికి ఏకంగా 40 మిలియన్ డాలర్లు ఖర్చు కాగా, దీని ప్రమోషన్, పంపిణీ కోసం అమెజాన్ మరో 35 మిలియన్ డాలర్లు వెచ్చించడం వివాదానికి దారితీసింది. సాధారణంగా ఇలాంటి చిత్రాలకు పదో వంతు బడ్జెట్ కూడా ఉండదని విశ్లేషకులు అంటున్నారు. అంతేకాకుండా ఈ చిత్రానికి మెలానియా ట్రంప్ స్వయంగా పెయిడ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. దీంతో సినిమాలో ఏ సన్నివేశాలు ఉండాలి, వేటిని తొలగించాలనే దానిపై ఆమెకు పూర్తి నియంత్రణ లభించింది. ట్రంప్ సర్కార్‌ను ప్రసన్నం చేసుకునేందుకే అమెజాన్ ఇంత భారీగా ఖర్చు చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ ప్రదర్శన సందర్భంగా ఓ విలేకరి ట్రంప్‌ను ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. "మీ జీవితంలో మెలానియా లేకున్నా మీరు ఇదే వ్యక్తిగా ఉండేవారా?" అని ప్రశ్నించగా, ట్రంప్ నవ్వుతూ.. "ఇది చాలా ప్రమాదకరమైన ప్రశ్న, జాగ్రత్తగా సమాధానం చెప్పాలి" అన్నారు. "ఆమె నాకు ఎంతో సహాయం చేసింది. చాలా గౌరవనీయురాలు, తెలివైనది. కొన్నిసార్లు నేను అదుపుతప్పినప్పుడు కూడా ఆమె చాలా సంయమనంతో ఉంటుంది" అని తన భార్యను ప్రశంసించారు.

అయితే, ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకోవడానికే ఈ సినిమాను కొనుగోలు చేసి, ప్రమోట్ చేశారన్న ఆరోపణలను అమెజాన్, చిత్ర దర్శకుడు బ్రెట్ రాట్నర్ ఖండించారు. "ఇది డబ్బు సంపాదించడం కోసం కాదు. ట్రంప్‌లు ఇప్పటికే చాలా సంపన్నులు" అని రాట్నర్ అన్నారు. మరోవైపు ఈ డాక్యుమెంటరీ ప్రదర్శనపై డెమోక్రాట్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. మినియాపొలిస్‌లో మరోసారి కాల్పుల ఘటన జరిగి, ప్రభుత్వ షట్‌డౌన్ ప్రమాదం పొంచి ఉన్న సమయంలో అధ్యక్షుడి ప్రాధాన్యతలు ఇలా ఉన్నాయని వారు ప్రశ్నిస్తున్నట్లు 'ది వాషింగ్టన్ పోస్ట్' కథనం పేర్కొంది.


More Telugu News