కెనడాకు ట్రంప్ మరో షాక్.. ఈసారి విమానాలపై గురి

  • కెనడా విక్ర‌యించే విమానాలపై 50శాతం సుంకం విధిస్తామని ట్రంప్ వార్నింగ్‌
  • అమెరికా జెట్లకు అనుమతి నిరాకరించడమే కారణమని వెల్లడి
  • బొంబార్డియర్ విమానాల సర్టిఫికేషన్ రద్దు చేస్తామని స్పష్టీకరణ
  • ప్రధాని మార్క్ కార్నీతో పెరుగుతున్న విభేదాల నేపథ్యంలో కొత్త హెచ్చరిక
  • ఇప్పటికే కెనడా దిగుమతులపై 100శాతం టారిఫ్ విధిస్తానని బెదిరింపు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కెనడా మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదురుతోంది. కెనడా నుంచి అమెరికాకు విక్రయించే విమానాలపై 50శాతం సుంకం విధిస్తానని ఆయన గురువారం హెచ్చరించారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీతో ఆయనకు ఉన్న విభేదాల‌ నేపథ్యంలో ఈ కొత్త హెచ్చరిక ప్రాధాన్యం సంతరించుకుంది.

జార్జియాలోని సవానా కేంద్రంగా పనిచేసే గల్ఫ్‌స్ట్రీమ్ ఏరోస్పేస్ సంస్థకు చెందిన జెట్లకు కెనడా సర్టిఫై చేయడానికి నిరాకరించిందని ట్రంప్ ఆరోపించారు. దీనికి ప్రతిగా, కెనడాకు చెందిన అతిపెద్ద విమాన తయారీ సంస్థ బొంబార్డియర్‌తో సహా అన్ని కెనడియన్ విమానాల ధ్రువీకరణను అమెరికా రద్దు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. "ఈ పరిస్థితిని వెంటనే సరిదిద్దకపోతే, అమెరికాలో విక్రయించే ప్రతి కెనడియన్ విమానంపై 50శాతం సుంకం విధిస్తాను" అని ట్రంప్ తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు.

కెనడాతో చైనా వాణిజ్య ఒప్పందం చేసుకుంటే, ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 100శాతం సుంకం విధిస్తానని ట్రంప్ గత వారాంతంలోనే హెచ్చరించారు. అయితే, కెనడా ఇప్పటికే ఆ ఒప్పందం చేసుకోవడంతో ఆ సుంకాల విధింపుపై ట్రంప్ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఇక‌, ట్రంప్ తాజా హెచ్చరికలపై బొంబార్డియర్ సంస్థ గానీ, కెనడా రవాణా మంత్రిత్వ‌శాఖ గానీ ఇంకా స్పందించలేదు.


More Telugu News