ముఖ్యమంత్రి చంద్రబాబు నన్ను టార్గెట్‌ చేశారు: చెవిరెడ్డి

  • 226 రోజుల తర్వాత చెవిరెడ్డి విడుదల.. తనను టార్గెట్ చేశారంటూ సెన్సేషనల్ కామెంట్స్
  • మద్యం కేసులో బెయిలుపై విడుదలైన చెవిరెడ్డి, సజ్జల శ్రీధర్‌రెడ్డి
  • చంద్రబాబు సొంత నియోజకవర్గం నుంచి గెలవడమే తప్పా అని చెవిరెడ్డి ప్రశ్న
  • బాణసంచా కాల్చి, నినాదాలతో జైలు వద్ద స్వాగతం పలికిన కార్యకర్తలు
మద్యం అక్రమాల కేసులో అరెస్టయిన వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఎట్టకేలకు జైలు నుంచి బయటకు వచ్చారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో గురువారం రాత్రి ఆయన విజయవాడ జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనతో పాటు ఇదే కేసులో నిందితులుగా ఉన్న వెంకటేశ్ నాయుడు (226 రోజుల తర్వాత), సజ్జల శ్రీధర్‌రెడ్డి (280 రోజుల తర్వాత) కూడా విడుదలయ్యారు.

జైలు నుంచి బయటకు రాగానే చెవిరెడ్డి భాస్కరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనను రాజకీయంగా టార్గెట్ చేశారని ఆరోపించారు. "ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం నుంచి రాజకీయంగా ఎదిగి, ఎమ్మెల్యేగా గెలిచినందుకే నాపై కక్ష కట్టారు. గతంలో 72 కేసులు పెట్టి వేధించడమే కాకుండా, జైలులో కూడా కనీస గౌరవం లేకుండా ప్రవర్తించారు" అని అన్నారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న తనను పోలీసులు బస్సులో కింద కూర్చోబెట్టి ఊర్లు తిప్పారని నాటి చేదు అనుభవాలను గుర్తు చేసుకున్నారు.

నేతల విడుదల సందర్భంగా విజయవాడ జైలు పరిసర ప్రాంతాలు వైసీపీ కార్యకర్తలతో సందడిగా మారాయి. మాజీ మంత్రి జోగి రమేశ్ ఆధ్వర్యంలో నాయకులు వీరికి స్వాగతం పలికారు. భారీగా బాణసంచా కాల్చడమే కాకుండా 'జై జగన్' నినాదాలతో ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు.

వెన్నునొప్పి సమస్యతో బాధపడుతున్న చెవిరెడ్డి.. ఏసీబీ కోర్టు అనుమతితో గురువారం ఉదయం మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమానికి చికిత్స కోసం వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతుండగానే హైకోర్టు నుంచి బెయిల్ ఉత్తర్వులు రావడంతో మధ్యాహ్నం తిరిగి జైలుకు చేరుకుని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని రాత్రికి విడుదలయ్యారు.

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం అక్రమాలపై సిట్ విచారణ ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే చెవిరెడ్డి సహా పలువురు నేతలను అరెస్ట్ చేశారు.


More Telugu News