దేశంలోని అత్యంత ప్రమాదకరస్థితిలోని మూడు డ్యామ్‌లలో మేడిగడ్డ

  • డ్యామ్‌ల భద్రతపై పార్లమెంటులో టీడీపీ ఎంపీల ప్రశ్న
  • అత్యంత ప్రమాదకరస్థితిలో మేడిగడ్డ, లోయర్ ఖజురి, బొకారో డ్యామ్‌లు 
  • వెల్లడించిన కేంద్ర జల్‌శక్తి శాఖ
తెలంగాణ రాష్ట్రంలోని మేడిగడ్డ డ్యామ్ అత్యంత ప్రమాదకరస్థితిలో ఉందని కేంద్ర జల్‌శక్తి శాఖ వెల్లడించింది. డ్యామ్‌ల భద్రతపై టీడీపీ ఎంపీలు లక్ష్మీనారాయణ, శబరి పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. ఈ క్రమంలో మేడిగడ్డతో పాటు దేశంలోని వివిధ ప్రాజెక్టులపై కీలక సమాధానం ఇచ్చింది.

దేశంలో 50 ఏళ్లకు పైబడిన డ్యామ్‌లు 1,681 ఉన్నాయని జల్‌శక్తి శాఖ తెలిపింది. గత సంవత్సరం వర్షాకాలం కంటే ముందు 6,524 డ్యామ్‌లు తనిఖీ చేశామని కేంద్రం వెల్లడించింది. వర్షాకాలం అనంతరం మరో 6,553 డ్యామ్‌లు తనిఖీ చేసినట్లు తెలిపింది.

ఈ తనిఖీలలో మూడు డ్యామ్‌లు అత్యంత ప్రమాదకరంగా ఉన్నట్లు వెల్లడైందని పేర్కొంది. వాటిలో తెలంగాణలోని మేడిగడ్డ, ఉత్తరప్రదేశ్‌లోని లోయర్ ఖజురి, ఝార్ఖండ్‌లోని బొకారో డ్యామ్‌లు ఉన్నట్లు వెల్లడించింది. మేడిగడ్డ డ్యామ్‌కు సంబంధించి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినట్లు జల్‌శక్తి శాఖ తెలిపింది.


More Telugu News