భారత్‌లో భారీగా పెరిగిన ఇంటర్నెట్ వినియోగదారులు ... పట్టణాల కంటే గ్రామాలదే హవా!

  • భారత్‌లో 95 కోట్లు దాటిన ఇంటర్నెట్ వినియోగదారులు
  • మొత్తం యూజర్లలో 57 శాతం గ్రామీణ ప్రాంతాల వారే
  • పట్టణాల కన్నా గ్రామాల్లోనే నాలుగు రెట్లు అధిక వృద్ధి
  • విపరీతంగా పెరిగిన షార్ట్ వీడియోలు, ఏఐ ఫీచర్ల వాడకం
భారత్‌లో ఇంటర్నెట్ వినియోగం శరవేగంగా విస్తరిస్తోంది. 2025 నాటికి దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 95 కోట్లు దాటింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కనెక్టివిటీ పెరగడం, షార్ట్ వీడియోల వినియోగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వాడకం అధికమవ్వడమే ఇందుకు ప్రధాన కారణాలని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (IAMAI) వెల్లడించింది.

IAMAI, కాంతార్ సంస్థలు సంయుక్తంగా రూపొందించిన 'ఇంటర్నెట్ ఇన్ ఇండియా రిపోర్ట్ 2025' నివేదికను గురువారం విడుదల చేశాయి. ఈ నివేదిక ప్రకారం, ప్రస్తుతం దేశంలో 95.8 కోట్ల యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. గతేడాదితో పోలిస్తే ఇది 8 శాతం అధికం. ఈ వృద్ధిలో గ్రామీణ భారతానిదే కీలక పాత్ర. మొత్తం ఇంటర్నెట్ వినియోగదారుల్లో 57 శాతం (సుమారు 54.8 కోట్లు) గ్రామీణ ప్రాంతాలకు చెందినవారే ఉండటం విశేషం. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామాల్లో ఇంటర్నెట్ వాడకం నాలుగు రెట్లు వేగంగా పెరుగుతోందని నివేదిక స్పష్టం చేసింది.

ఈ నివేదికలో మరికొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం ప్రధాన స్రవంతిలో భాగమైంది. ఇంటర్నెట్ యూజర్లలో దాదాపు 44 శాతం మంది వాయిస్ సెర్చ్, చాట్‌బాట్‌లు, ఏఐ ఫిల్టర్లు వంటి ఫీచర్లను వినియోగిస్తున్నట్లు తేలింది. అదేవిధంగా, షార్ట్ వీడియోల ప్రభావం కూడా గణనీయంగా పెరిగింది. దాదాపు 58.8 కోట్ల మంది (61 శాతం) యూజర్లు షార్ట్ వీడియోలను చూస్తున్నారు. ఈ విషయంలోనూ గ్రామీణ వినియోగదారులే ముందున్నారు.

కర్ణాటక ప్రభుత్వ ఐటీ శాఖ కార్యదర్శి మంజుల ఎన్ సమక్షంలో జరిగిన ఇండియా డిజిటల్ సమ్మిట్‌లో ఈ నివేదికను విడుదల చేశారు. ఈ గణాంకాలతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ మార్కెట్లలో ఒకటిగా భారత్ తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.


More Telugu News