ప్రపంచవ్యాప్తంగా తొలిసారి 5 వేల టన్నులకు పెరిగిన బంగారం డిమాండ్.. భారత్‌లో తగ్గుదల

  • 2024లో 4,961.9 టన్నులుగా బంగారం డిమాండ్
  • 2025లో 5,002 టన్నులకు పెరిగిన డిమాండ్
  • భారత్‌లో తగ్గిన బంగారం, ఆభరణాల డిమాండ్
2025 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా బంగారం డిమాండ్ తొలిసారి 5 వేల టన్నులు దాటింది. తద్వారా గత ఏడాది బంగారం డిమాండ్ ఆల్ టైమ్ గరిష్ఠానికి చేరుకుంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యుజీసీ) ప్రకారం, 2024లో ఇది 4,961.9 టన్నులుగా ఉండగా, 2025లో 5,002 టన్నులకు పెరిగింది. ప్రస్తుత అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో పెట్టుబడులకు సురక్షిత మార్గంగా భావిస్తుండటం వల్ల బంగారానికి డిమాండ్ పెరుగుతోంది.

పెట్టుబడుల రూపంలో బంగారానికి డిమాండ్ 2024లో 1,185.4 టన్నులుగా ఉండగా, 2025లో 2,175.3 టన్నులకు పెరిగింది. ప్రపంచంలోని వివిధ కేంద్ర బ్యాంకులు గత సంవత్సరం 863 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి. నేషనల్ బ్యాంక్ ఆఫ్ పోలాండ్ అత్యధికంగా 102 టన్నుల పసిడిని కొనుగోలు చేసింది. అదే సమయంలో బంగారం ధరలు భారీగా పెరుగుతుండటంతో ఆభరణాలకు డిమాండ్ 2024తో పోలిస్తే 18 శాతం తగ్గింది. బంగారం ధరలు 2024తో పోలిస్తే భారీగా పెరగడంతో విలువపరంగా 18 శాతం పెరిగింది.

2024తో పోలిస్తే గత సంవత్సరం బంగారానికి మన దేశంలో డిమాండ్ తగ్గింది. 2024లో 828.8 టన్నులుగా ఉండగా, 2025లో 11 శాతం తగ్గి 710.9 టన్నులకు పడిపోయింది. విలువపరంగా చూస్తే 2024లో రూ.5,75,930 కోట్ల నుంచి 2025లో రూ.7,51,490 కోట్లకు పెరిగింది. 2026లో దేశంలో బంగారం డిమాండ్ 600 నుంచి 700 టన్నులుగా ఉంటుందని డబ్ల్యూజీసీ అంచనా వేసింది.

ఆభరణాల డిమాండ్ కూడా భారత్‌లో మందగించింది. 2024లో 563.4 టన్నుల డిమాండ్ ఉండగా 2025లో 24 శాతం తగ్గి 430.5 టన్నులకు పడిపోయింది. విలువ పరంగా 2024లో రూ.4,04,510 కోట్లతో పోలిస్తే గత సంవత్సరం 12 శాతం పెరిగి రూ.4,54,390 కోట్లకు చేరుకుంది. ఆర్బీఐ వద్ద 2024లో 73 టన్నుల బంగారం నిల్వలు ఉండగా, గత ఏడాది 4 టన్నులు కొనుగోలు చేసింది.


More Telugu News