వరల్డ్ కప్‌కు 3 రోజుల ముందు వాషింగ్టన్ సుందర్‌కు ఫిట్‌నెస్ పరీక్ష... కొనసాగుతున్న ఉత్కంఠ

  • టీ20 ప్రపంచకప్‌లో వాషింగ్టన్ సుందర్ ఆడ‌టంపై సందేహాలు
  • గాయం నుంచి కోలుకోకపోవడంతో ఫిబ్రవరి 4న ఫిట్‌నెస్ టెస్ట్
  • టెస్ట్ రిపోర్ట్ వచ్చేవరకూ ప్రత్యామ్నాయం ప్రకటించని సెలక్టర్లు
  • సుందర్ స్థానంలో రియాన్ పరాగ్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం
టీ20 ప్రపంచకప్ 2026 ముంగిట టీమిండియాలో ఆందోళన నెలకొంది. స్టార్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ టోర్నీలో ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో అతని ఫిట్‌నెస్‌ను నిర్ధారించేందుకు ఫిబ్రవరి 4న బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో కీలక ఫిట్‌నెస్ పరీక్ష నిర్వహించనున్నారు.

ఈ నెల‌ 11న న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో సుందర్ పక్కటెముకల గాయానికి గురయ్యాడు. అతను కోలుకోవడానికి అనుకున్నదానికంటే ఎక్కువ సమయం పడుతోంది. సుందర్ నుంచి అధికారిక మెడికల్ అప్‌డేట్ వచ్చేవరకు ఎలాంటి ప్రత్యామ్నాయం ప్రకటించకూడదని సెలక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయించుకున్నట్టు తెలిసింది. నిబంధనల ప్రకారం ఈ నెల‌ 30లోపు జట్లలో మార్పులు చేసుకోవచ్చు. అయితే, టోర్నమెంట్ టెక్నికల్ కమిటీ అనుమతిస్తే గాయం కారణంగా టోర్నీ మధ్యలో కూడా ఆటగాళ్లను మార్చుకునే అవకాశం ఉంటుంది.

భారత జట్టు ఫిబ్రవరి 3న ముంబైలో సమావేశమై, ఫిబ్రవరి 4న దక్షిణాఫ్రికాతో వార్మప్ మ్యాచ్ ఆడనుంది. అదే రోజు సుందర్‌కు ఫిట్‌నెస్ టెస్ట్ జరగనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. బీసీసీఐ వర్గాల స‌మాచారం ప్రకారం సుందర్‌కు పక్కటెముకల దగ్గర కండరాల్లో చీలిక ఏర్పడినట్టు తెలుస్తోంది. గాయం నుంచి సహజంగా కోలుకున్న తర్వాతే అతను తిరిగి మైదానంలోకి రావాల్సి ఉంటుందని ఓ అధికారి తెలిపారు.

ఒకవేళ సుందర్ అందుబాటులో లేకపోతే అతని స్థానంలో రియాన్ పరాగ్‌ను ప్రధాన ప్రత్యామ్నాయంగా చూస్తున్నట్లు స‌మాచారం. వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ జట్టులో ఉండటంతో టీమ్ బ్యాలెన్స్ పటిష్ఠంగానే కనిపిస్తోంది. ఒకవేళ సుందర్ టోర్నీ చివరి దశకైనా అందుబాటులోకి వస్తాడని భావిస్తే, అతని కోసం వేచి చూసే అవకాశం కూడా ఉందని సమాచారం.


More Telugu News