మౌలిక సదుపాయాల్లో దూసుకెళుతున్న భారత్.. ఆర్థిక సర్వే 2026లో కీలక విషయాలు

  • మౌలిక రంగంలో భారత్ దూకుడును వెల్లడించిన ఆర్థిక సర్వే 2025-26
  • పదేళ్లలో మూడు రెట్లు పెరిగిన పునరుత్పాదక ఇంధన సామర్థ్యం
  • 2014 నుంచి రెట్టింపున‌కు పైగా పెరిగిన విమానాశ్రయాల సంఖ్య
  • జాతీయ రహదారుల నెట్‌వర్క్‌లో 60 శాతం వృద్ధి
  • ప్రభుత్వ మూలధన వ్యయం 4.2 రెట్లు పెరిగిందని వెల్లడి
భారతదేశ వృద్ధి వ్యూహంలో మౌలిక సదుపాయాల రంగం కేంద్ర స్థానంలో ఉందని, ఈ రంగంలో ప్రభుత్వ మూలధన వ్యయం స్థిరంగా పెరుగుతోందని ఆర్థిక సర్వే 2025-26 స్పష్టం చేసింది. ఇవాళ‌ విడుదల చేసిన ఈ సర్వే ప్రకారం, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడంలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామి దేశాల్లో ఒకటిగా నిలిచింది. తక్కువ, మధ్య ఆదాయ ఆర్థిక వ్యవస్థలలో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రైవేట్ పెట్టుబడుల విషయంలో ప్రపంచ బ్యాంకు ర్యాంకింగ్స్‌లో భారత్ టాప్-5 దేశాల్లో ఒకటిగా నిలిచింది.

పీఎం గతిశక్తి, జాతీయ లాజిస్టిక్స్ పాలసీ వంటివి ఈ వృద్ధికి దోహదపడ్డాయని సర్వే పేర్కొంది. దీనివల్ల లావాదేవీల ఖర్చులు, ప్రాజెక్టుల అమలులో రిస్కులు తగ్గాయి. ప్రభుత్వ మూలధన వ్యయం ఎఫ్‌వై18లో రూ. 2.63 లక్షల కోట్ల నుంచి ఎఫ్‌వై26 నాటికి రూ. 11.21 లక్షల కోట్లకు, అంటే దాదాపు 4.2 రెట్లు పెరిగింది.

జాతీయ రహదారుల నెట్‌వర్క్ 2014లో 91,287 కిలోమీటర్ల నుంచి 2026 డిసెంబర్ నాటికి 1,46,572 కిలోమీటర్లకు విస్తరించింది. విమానయాన రంగంలో విమానాశ్రయాల సంఖ్య 2014లో 74 నుంచి 2025 నాటికి 164కు పెరిగింది. రైల్వే నెట్‌వర్క్‌లో 99.1 శాతం విద్యుదీకరణ పూర్తయింది. 'మారిటైమ్ ఇండియా విజన్' వంటి పథకాలతో భారత పోర్టుల పనితీరు మెరుగుపడి, 7 పోర్టులు ప్రపంచ బ్యాంకు టాప్ 100 జాబితాలో స్థానం దక్కించుకున్నాయి.

విద్యుత్ రంగంలోనూ భారీ విస్తరణ జరిగింది. మొత్తం స్థాపిత సామర్థ్యం 509.74 గిగావాట్లకు చేరగా, ఇందులో పునరుత్పాదక ఇంధన వాటా దాదాపు 49.83 శాతంగా ఉంది. గత దశాబ్ద కాలంలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం మూడు రెట్లకు పైగా పెరిగి 253.96 గిగావాట్లకు చేరుకుందని సర్వే తెలిపింది. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది.


More Telugu News