కేసీఆర్ కు సిట్ నోటీసులపై మహేశ్ గౌడ్ స్పందన.. బాధ్యులకు శిక్ష పడాల్సిందేనని వ్యాఖ్య

  • కేసీఆర్ పై తమకు గౌరవం ఉందన్న మహేశ్ గౌడ్
  • విచారణ పారదర్శకంగా జరుగుతోందని వ్యాఖ్య
  • పూర్తి స్థాయిలో విచారణ జరిగితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్న మహేశ్
తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నంది నగర్ లోని ఆయన నివాసంలో సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. కేసీఆర్ వయసును దృష్టిలో ఉంచుకొని ఆయన కోరిన ప్రదేశంలోనే విచారిస్తామని సిట్ అధికారులు తమ నోటీసుల్లో పేర్కొన్నారు. 

మరోవైపు, కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడంపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. ఈ వ్యవహారంలో పారదర్శకంగా సిట్ విచారణ జరుగుతోందని ఆయన అన్నారు. కేసీఆర్ పై తమకు ఎంతో గౌరవం ఉందని... అయితే, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరెవరి భాగస్వామ్యం ఉందో నిగ్గుతేలాల్సి ఉందని చెప్పారు.

అప్పటి సీఎం, మంత్రుల ఆదేశాలు లేకుండా ఇంతటి భారీ స్థాయి ఉల్లంఘనలు జరిగే అవకాశమే లేదని ఆయన అన్నారు. పూర్తి స్థాయిలో సిట్ దర్యాప్తు జరిగితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. దర్యాప్తులో భాగంగా ఎవరికైనా నోటీసులు ఇచ్చే అధికారం సిట్ కు ఉందని... కేసీఆర్‌కు నోటీసుల విషయంలో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని చెప్పారు. బాధ్యులు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని అన్నారు.


More Telugu News