యూజీసీ 2026 నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే

  • యూజీసీ 2026 సమానత్వ నిబంధనలను నిలిపివేసిన సుప్రీంకోర్టు
  • తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు 2012 నిబంధనలే అమల్లో ఉంటాయని ఆదేశం
  • జనరల్ కేటగిరీకి అన్యాయం చేసేలా ఉన్నాయని దాఖలైన పిటిషన్లపై విచారణ
  • ఈ నిబంధనలు సమాజాన్ని విభజించే ప్రమాదం ఉందన్న ధర్మాసనం
ఉన్నత విద్యా సంస్థల్లో సమానత్వ ప్రోత్సాహం కోసం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తీసుకొచ్చిన 2026 నిబంధనల అమలుపై సుప్రీంకోర్టు ఇవాళ‌ మధ్యంతర స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు 2012 నాటి పాత నిబంధనలే అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వానికి, యూజీసీకి నోటీసులు జారీ చేసింది.

యూజీసీ కొత్త నిబంధనలు జనరల్ కేటగిరీ విద్యార్థుల పట్ల వివక్ష చూపించేలా ఉన్నాయని, వారికి ఫిర్యాదు చేసే యంత్రాంగాన్ని నిరాకరిస్తున్నాయని ఆరోపిస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. "మేము జోక్యం చేసుకోకపోతే, ఇది ప్రమాదకరమైన ప్రభావాన్ని చూపుతుంది. సమాజాన్ని విభజిస్తుంది, తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది" అని ధర్మాసనం ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.

కొత్త నిబంధనల ప్రకారం ‘కుల ఆధారిత వివక్ష’ అనే పదాన్ని కేవలం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకే పరిమితం చేశారని పిటిషనర్లు ఆరోపించారు. దీనివల్ల జనరల్ కేటగిరీకి చెందిన వారికి ఎలాంటి వివక్ష ఎదురైనా ఫిర్యాదు చేసే అవకాశం లేకుండా పోతుందని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15(1), 21లను ఉల్లంఘించడమేనని వాదించారు.

పిటిషనర్ల వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, ‘సంపూర్ణ న్యాయం’ కోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద తమకున్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించి ఈ నిబంధనలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. అనంతరం తదుపరి విచారణను మార్చి 19వ తేదీకి వాయిదా వేసింది.


More Telugu News