ఢిల్లీలో దారుణం.. గర్భిణీ అని చూడకుండా.. డంబెల్‌తో కొట్టి చంపేశాడు!

  • 'స్వాట్‌' కమాండోగా పనిచేస్తున్న గర్భిణీ దారుణ హత్య
  • డంబెల్‌తో తలపై కొట్టి చంపిన భర్త అంకుర్
  • ఆర్థిక వివాదాలే ఈ దారుణానికి కారణమని వెల్లడి
  • కట్నం కోసం అత్తింటివారు వేధించినట్లు ఆరోపణలు
  • నిందితుడైన భర్తను అరెస్ట్ చేసిన పోలీసులు
ఢిల్లీలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ప్రత్యేక ఆయుధాలు, వ్యూహాల్లో (స్వాట్‌) శిక్షణ పొందిన ఓ మహిళా కమాండో తన భర్త చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. ఆర్థిక విషయాల్లో తలెత్తిన గొడవలు ముదరడంతో భార్య తలపై డంబెల్‌తో బలంగా కొట్టి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు భ‌ర్త‌. మృతురాలు నాలుగు నెలల గర్భిణీ కావడం తీవ్ర విషాదాన్ని నింపింది.

వివరాల్లోకి వెళితే... ఢిల్లీ పోలీస్ విభాగంలో 'స్వాట్‌' కమాండోగా పనిచేస్తున్న 27 ఏళ్ల కాజల్ చౌదరి, రక్షణ మంత్రిత్వ శాఖలో క్లర్క్‌గా పనిచేస్తున్న అంకుర్‌ను 2023లో వివాహం చేసుకున్నారు. వీరికి ఏడాదిన్నర వయసున్న కుమారుడు ఉన్నాడు. ఈ నెల‌ 22న భార్యాభర్తల మధ్య డబ్బు విషయంలో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహంతో అంకుర్, కాజల్ తలపై డంబెల్‌తో దాడి చేశాడు.

తీవ్రమైన గాయాలతో ఆసుపత్రిలో చేరిన కాజల్, చికిత్స పొందుతూ మృతి చెందారు. కాజల్ తన సోదరుడు నిఖిల్‌తో ఫోన్‌లో మాట్లాడుతుండగానే అంకుర్ ఈ దాడికి పాల్పడినట్లు తెలిసింది. అంతేకాకుండా కట్నం కోసం కాజల్ అత్తగారు, ఇద్దరు ఆడపడుచులు నిరంతరం వేధించేవారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు అంకుర్‌పై హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతను జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు.


More Telugu News