స్పీకర్ నోటీసులకు మా న్యాయవాది స్పందించారు: దానం నాగేందర్

  • పార్టీ ఫిరాయింపుల కేసులో దానంకు స్పీకర్ నోటీసులు
  • స్పీకర్ కు తన న్యాయవాది పూర్తి వివరాలతో లేఖ పంపారన్న దానం
  • వ్యక్తిగతంగా హాజరుకావాలని తనకు ఎవరూ చెప్పలేదని వెల్లడి
తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం సెగ పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు కూడా ఈ వ్యవహారంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో దానం నాగేందర్ స్పందిస్తూ... స్పీకర్ కార్యాలయం నుంచి అందిన నోటీసులపై తన న్యాయవాది స్పందించారని... వివరణ ఇస్తూ స్పీకర్ కు లేఖ రాశారని తెలిపారు. అయితే, ఆ వివరణ లేఖలో ఏయే అంశాలను పేర్కొన్నారో తనకు అవగాహన లేదని చెప్పారు. 

తాము పంపిన లేఖకు స్పీకర్ కార్యాలయం నుంచి ఇప్పటి వరకు తమకు ఎలాంటి జవాబు రాలేదని తెలిపారు. విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని తనకు ఎవరూ చెప్పలేదని... ఈ వ్యవహారాన్ని ప్రస్తుతానికి తన లీగల్ టీమ్ చూసుకుంటుందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ తనను ఇప్పటి వరకు సస్పెండ్ చేయలేదని గుర్తు చేశారు. బీఆర్ఎస్ తీసుకునే యాక్షన్ కు తన రియాక్షన్ ఉంటుందని చెప్పారు. తాను ఎన్నికలకు భయపడే వ్యక్తిని కానని అన్నారు. నియోజకవర్గ ప్రజలకు మంచి చేయాలనే కోణంలోనే తన నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. 

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణను వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. దానం నాగేందర్ విషయంలో రేపు జరిగే విచారణలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.


More Telugu News