గంజాయి, డ్రగ్స్ నిర్మూలన పట్ల 70 శాతం ప్రజలు సంతృప్తిగా ఉన్నారు: నారా లోకేశ్

  • పూర్తిగా అరికట్టే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి
  • ఎన్జీవోల ఆధ్వర్యంలో డీ-అడిక్షన్ కేంద్రాల నిర్వహణకు కార్యాచరణ రూపొందించాలని సూచన
  • కేజీ నుంచి పీజీ వరకు డ్రగ్-ఫ్రీ ఏపీ కరిక్యులమ్ అమలుకు చర్యలు తీసుకోవాలని సూచన
  • గంజాయి, మాదక ద్రవ్యాల నియంత్రణపై మంత్రుల ఉపసంఘం సమావేశంలో మంత్రి లోకేశ్
రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యలు పట్ల 70 శాతం ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, మిగిలిన 30 శాతం మంది కూడా సంతృప్తి చెందేలా దృష్టి సారించాలని అధికారులను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు.

రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ ముప్పును అరికట్టేందుకు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, ప్రణాళికలపై హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన కేబినెట్ సబ్ కమిటీ భేటీలో మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన కఠిన చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని అన్నారు.

పూర్తిస్థాయిలో అరికట్టే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్జీవోల ఆధ్వర్యంలో డీ-అడిక్షన్ కేంద్రాల నిర్వహణకు కార్యాచరణ రూపొందించాలని, డ్రగ్స్‌పై విద్యార్థుల్లో అవగాహన కలిగించేలా కేజీ నుంచి పీజీ వరకు డ్రగ్-ఫ్రీ ఏపీ కరిక్యులమ్ అమలుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈగల్ యాప్‌ను లీప్ యాప్‌కు అనుసంధానించాలని మంత్రి ఆదేశించారు.

గంజాయి సాగును పూర్తిగా అరికట్టాం

గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు ఈగల్(ఎలైట్ యాంటీ-నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్) ఆధ్వర్యంలో ఇప్పటివరకు చేపట్టిన చర్యలను ఈ సందర్భంగా అధికారులు వివరించారు. రాష్ట్రంలో గంజాయి సాగును పూర్తిగా అరికట్టినట్లు తెలిపారు. జీరో గంజాయి సాగు రాష్ట్రంగా ఏపీ మారింది. ఎన్ కార్డ్(NCORD-నార్కో కోఆర్డినేషన్ సెంటర్) ప్రణాళికతో పూర్తిగా అనసంధానించామని అన్నారు.

ప్రణాళికాబద్ధంగా గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణ నెట్ వర్క్‌లను ధ్వంసం చేసినట్లు అధికారులు వివరించారు. గంజాయి, డ్రగ్స్ నియంత్రణ చర్యల్లో ఇతర రాష్ట్రాలకు ఏపీ నమూనాగా నిలిచిందని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 1,721 ఎన్డీపీఎస్(నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్) కేసులు నమోదు చేసి, 4,421 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.

40 వేల ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేయడంతో పాటు 35,400 అవగాహనా కార్యక్రమాల ద్వారా విద్యార్థులు, ప్రజల్లో గంజాయి, డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌తో పాటు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


More Telugu News