అమెజాన్‌లో మరో భారీ లేఆఫ్స్.. 16,000 మంది ఉద్యోగుల తొలగింపు

  • అమెజాన్‌లో రెండో విడతగా 16,000 ఉద్యోగాల కోత
  • మూడు నెలల వ్యవధిలోనే రెండోసారి భారీ లేఆఫ్స్ ప్రకటన
  • సంస్థాగత మార్పుల్లో భాగంగానే ఈ నిర్ణయమన్న కంపెనీ
  • ఉద్యోగాలు కోల్పోయిన వారికి సపోర్ట్ ప్యాకేజీ అందిస్తామని వెల్లడి
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వెల్లడించింది. మూడు నెలల వ్యవధిలో కంపెనీ ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగాల కోత విధించడం ఇది రెండోసారి. సంస్థలో చేపడుతున్న అదనపు సంస్థాగత మార్పులలో భాగంగానే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.

ఈ విషయంపై అమెజాన్ పీపుల్ ఎక్స్‌పీరియన్స్ అండ్ టెక్నాలజీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బెత్ గెల్లెట్టి ఒక బ్లాగ్ పోస్ట్‌లో స్పందించారు. "ఇది కష్టమైన‌ వార్త అని నాకు తెలుసు. సంస్థను బలోపేతం చేసేందుకు, అనవసరమైన లేయర్‌లను తగ్గించి, యాజమాన్య బాధ్యతను పెంచేందుకు అక్టోబర్‌లో ప్రారంభించిన ప్రక్రియను కొన్ని బృందాలు ఇప్పుడు పూర్తి చేశాయి" అని ఆమె వివరించారు. ఈ క్రమంలోనే సుమారు 16,000 ఉద్యోగాలపై ప్రభావం పడుతోందని ఆమె పేర్కొన్నారు.

ఉద్యోగం కోల్పోయిన వారికి అండగా ఉంటామని అమెజాన్ హామీ ఇచ్చింది. అమెరికాలోని ఉద్యోగులకు కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి 90 రోజుల సమయం ఇవ్వనున్నట్లు తెలిపింది. ఆ తర్వాత కూడా ఉద్యోగం దొరకని వారికి సెవరాన్స్ ప్యాకేజీ, ఆరోగ్య బీమా, ఔట్‌ప్లేస్‌మెంట్ సేవలు వంటి ప్రయోజనాలను అందిస్తామని స్పష్టం చేసింది.

అయితే, ప్రతి కొన్ని నెలలకు ఇలాంటి లేఆఫ్‌లు ప్రకటించడం తమ ప్రణాళిక కాదని కంపెనీ స్పష్టం చేసింది. అదే సమయంలో తమ భవిష్యత్తుకు అవసరమైన వ్యూహాత్మక విభాగాల్లో పెట్టుబడులు, నియామకాలు కొనసాగిస్తామని బెత్ గెల్లెట్టి తెలిపారు. గతంలో ప్రకటించిన 14,000 ఉద్యోగాల కోతకు ఇది అదనం.


More Telugu News