సర్వే రాళ్లపై జగన్ బొమ్మ వేయించేందుకు ప్రజాధనం దుర్వినియోగం చేశారు: ఎమ్మెల్యే మాధవీరెడ్డి

  • గత వైకాపా ప్రభుత్వం రూ.700 కోట్లను దోచుకుందని ఆరోపణ
  • వైసీపీ నాయకులు క్రెడిట్ చోరీ అంటూ గగ్గోలు పెడుతున్నారని విమర్శ
  • పేటీఎం బ్యాచ్‌తో తప్పుదారి పట్టిస్తున్నారని మండిపాటు
సర్వే రాళ్లపై జగన్ బొమ్మ వేయించేందుకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి, సుమారు రూ.700 కోట్లను వైకాపా ప్రభుత్వం దోచుకుందని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వైసీపీ పార్టీ నాయకులు 'క్రెడిట్ చోరీ' అంటూ పెద్ద ఎత్తున గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు. డబ్బులు పెట్టుకుని మాట్లాడించే పేటీఎం బ్యాచ్‌ను ముందు పెట్టుకుని ప్రజలను తప్పుదారి పట్టించాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

కానీ అసలు నిజం ఏంటంటే, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందజేస్తుండటమే వీళ్ల భయానికి కారణమని అన్నారు. ఒక ఆయుధం పిచ్చోడు చేతిలో ఉంటే ఎలా నాశనం చేస్తుందో, అదే ఆయుధం మంచి వ్యక్తి చేతిలో ఉంటే ఎలా ప్రజలకు ఉపయోగపడుతుందో ఈరోజు పట్టాదారు పాస్ పుస్తకాలు దానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని అన్నారు. జజగన్ మోహన్ రెడ్డి భూ రీసర్వే పేరుతో గత ఐదేళ్లలో చేసిన దోపిడీలు, ఆక్రమణలు ప్రజలు ఇంకా మర్చిపోలేదని అన్నారు.

అందుకే పట్టాదారు పాస్ పుస్తకాలు చేతికి వస్తే తమ దుర్మార్గాలు మళ్లీ గుర్తొస్తాయేమో అన్న భయంతో, వీళ్లంతా బయటకు వచ్చి 'క్రెడిట్ చోరీ' అంటూ విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కానీ వాస్తవం ఏమిటంటే, 2018లోనే తెలుగుదేశం ప్రభుత్వం మంచి ఉద్దేశంతో, రైతుల భూములకు భద్రత కల్పించాలనే లక్ష్యంతో భూ రీసర్వే ప్రక్రియను ప్రారంభించిందని గుర్తు చేశారు.

"తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జగ్గయ్యపేట నియోజకవర్గంలోని తక్కెళ్లపాడులో పైలట్ ప్రోగ్రామ్‌గా భూ రీసర్వే మొదలుపెట్టింది. కంటిన్యూస్ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్స్ (సీఓఆర్ఎస్) ద్వారా సాంకేతికంగా రీసర్వే చేయాలనే ఉద్దేశంతో 2018 సెప్టెంబర్ 25న జీఓ నెంబర్ 1348ను కూడా జారీ చేసింది. అయితే 2019లో దురదృష్టవశాత్తు టీడీపీ ఓడిపోవడంతో, వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చి ఈ భూ రీసర్వేను ప్రజల భూములు దోచుకునే ఆయుధంగా మార్చింది. వైకాపా ప్రభుత్వం రీసర్వే పేరుతో భూవివాదాలు సృష్టించి, ప్రజలను కోర్టుల చుట్టూ తిరగలేని పరిస్థితి తీసుకొచ్చింది. వేలాది భూములను 22-ఏ జాబితాలో చేర్చి, సమస్యలు పరిష్కరించకుండా ప్రజలను అల్లకల్లోలం చేసింది. ఆ తర్వాత 'క్లియర్ టైటిల్స్ ఇస్తాం' అని మోసం చేస్తూ 2023 అక్టోబర్ 31న ల్యాండ్ టైటిల్ యాక్ట్‌ను తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారా ప్రజల స్వేచ్ఛను హరించి, ఆస్తులను లాక్కోవాలనే దురుద్దేశమే స్పష్టంగా కనిపించింది" అని మండిపడ్డారు.

నీతి ఆయోగ్ సూచనల ప్రకారం నిపుణులు, న్యాయ అధికారులు ఉండాల్సిన అపిలేట్ ట్రిబ్యునల్‌లో 'ఎనీ పర్సన్' అనే పదాన్ని చేర్చి, వైసీపీ తన కార్యకర్తలనే నియమించుకునేలా వ్యవస్థను వక్రీకరించిందని ఆరోపించారు. స్థానిక కోర్టులకు వెళ్లే అవకాశం లేకుండా చేసి, నేరుగా హైకోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి తెచ్చిందని మండిపడ్డారు. రెవెన్యూ వ్యవస్థ మొత్తాన్ని రిజిస్ట్రేషన్ అధికారుల చేతుల్లో పెట్టి, ప్రజల ఆస్తులను గుప్పెట్లో పెట్టుకోవాలనే పెద్ద కుట్రకు తెరలేపిందని అన్నారు. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అసలు డాక్యుమెంట్లు ఇవ్వకుండా, డూప్లికేట్ కాపీలు ఇస్తామని, అసలు పత్రాలు ప్రైవేట్ కంపెనీల వద్ద ఉంచుతామని చట్టంలో చేర్చడం అత్యంత ప్రమాదకరమని అన్నారు. తరతరాలుగా ప్రజల దగ్గరే ఉన్న ఆస్తి పత్రాలను ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలనుకోవడం వైసీపీ దురుద్దేశానికి నిదర్శనమని మండిపడ్డారు. ఈ కుట్రను ప్రజలు గుర్తించారు కాబట్టే 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి భారీ మెజారిటీ ఇచ్చారని పేర్కొన్నారు.

వైకాపా ప్రభుత్వం సర్వే రాళ్ల పేరుతో ఒక నాయకుడి బొమ్మను పాతి, దానికి రూ.700 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని అన్నారు. "మా భూముల్లో దిష్టి బొమ్మలు పెట్టుకోవాలంటే మేమే పెట్టుకుంటాం. ప్రభుత్వ ఖర్చుతో నాయకుల బొమ్మలు ఎందుకు" అన్న ప్రశ్నకు వైకాపా వద్ద సమాధానం లేదని అన్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలపై బొమ్మల కోసం కూడా మరో రూ.20 కోట్లు వృథా చేశారని ఆరోపించారు. కానీ ఇప్పుడు రాజముద్రతో వచ్చిన కొత్త పాస్ పుస్తకాలు చూసి ప్రజలు నిజమైన మార్పు ఏమిటో గుర్తించారని అన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిల్ యాక్ట్‌ను రద్దు చేసిందని, ఆ నిర్ణయంతో ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారని అన్నారు. తర్వాత పూర్తిగా పారదర్శకంగా, సాంకేతికత ఆధారంగా భూ రీసర్వేను మళ్లీ ప్రారంభించిందని తెలిపారు. ప్రతి నియోజకవర్గం, మండలం, పంచాయతీలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి, రైతుల సమక్షంలోనే రీసర్వే చేపట్టిందని అన్నారు. దాదాపు 7 లక్షల 78 వేల ఫిర్యాదులను స్వీకరించి, ఒక సంవత్సరం లోపే పరిష్కరించడం గత పాలనలో జరిగిన భయాందోళనలకు ప్రత్యక్ష సాక్ష్యం అన్నారు. గ్రామ సభల్లో ఆస్తి వివరాలు నిర్ధారించిన తర్వాతే కేవైసీ పూర్తి చేసి, భారతదేశ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందజేశారని అన్నారు. ప్రజలు గర్వంగా తమ పాస్ పుస్తకాలు చేతబట్టి, "మా ఇంట్లోని దరిద్రమైన ఫోటో పోయింది" అని ఆనందం వ్యక్తం చేస్తున్నారని, నిజమైన ప్రజాపాలనకు ఇదే గుర్తు అన్నారు.

"వైసీపీ క్రెడిట్ చోరీ అంటోంది. కానీ 2018లో జారీ చేసిన జీఓలు, పైలట్ ప్రాజెక్టులు అన్నీ భూ రీసర్వే క్రెడిట్ పూర్తిగా తెలుగుదేశం పార్టీకేనని స్పష్టం చేస్తున్నాయి. మీరు కొనసాగించింది కేవలం టీడీపీ మొదలుపెట్టిన ప్రక్రియే. పేటీఎం బ్యాచ్‌తో ఎంత డ్రామా చేసినా, ప్రజలు నిజాన్ని గుర్తించారు కాబట్టే 2024లో 164 సీట్లతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. భూవివాదాలు సృష్టించిన క్రెడిట్, రెవెన్యూ వ్యవస్థను నాశనం చేసిన క్రెడిట్, ప్రజలను భయాందోళనకు గురి చేసిన క్రెడిట్ అంతా వైసీపీకే దక్కుతుంది. ఆ క్రెడిట్‌ను మేము దోచుకోవాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం ప్రజల ఆస్తుల రక్షణ, యువత భవిష్యత్, అభివృద్ధి కోసం నిరంతరం పని చేస్తుంది. రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ముందంజలో నిలపాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు. ఆ ప్రయాణంలో కార్యకర్తలంతా సైనికుల్లా నిలబడతాం" అని మాధవీ రెడ్డి స్పష్టం చేశారు.


More Telugu News