అజిత్ పవార్ మృతి.. విమాన ప్రమాదంపై మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

  • విమాన ప్రమాదంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలన్న మమతా  బెనర్జీ
  • రాజకీయ నాయకుల భద్రతపై కూడా అనుమానాలు తలెత్తుతున్నాయని ఆందోళన
  • ఇతర దర్యాప్తు సంస్థలపై తమకు విశ్వాసం లేదన్న మమతా బెనర్జీ
  • అజిత్ పవార్ మృతిలో కుట్రకోణం ఉండవచ్చన్న మమతా బెనర్జీ
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ప్రమాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బారామతి విమాన ప్రమాదంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ ప్రమాదం నేపథ్యంలో దేశంలోని రాజకీయ నాయకుల భద్రతపై కూడా అనుమానాలు తలెత్తుతున్నాయని ఆమె అన్నారు.

అజిత్ పవార్ మృతిలో కుట్రకోణం ఉండవచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. పవార్ మరణ వార్త విని తాను దిగ్భ్రాంతికి గురయ్యానని, ఆయన మృతి రాష్ట్రానికి, దేశానికి తీరని వెలితి అన్నారు. సుప్రీంకోర్టు పైన మాత్రమే తమకు నమ్మకం ఉందని, అత్యున్నత న్యాయస్థానం పర్యవేక్షణలోనే దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేశారు. ఇతర దర్యాప్తు సంస్థలపై తమకు విశ్వాసం లేదని, అవి వాటి స్వేచ్ఛను కోల్పోయాయని విమర్శించారు.

అజిత్ పవార్ బీజేపీని వీడాలని ఆలోచిస్తున్నారని ఇటీవల ప్రచారం జరిగిందని ఈ సందర్భంగా మమతా బెనర్జీ గుర్తు చేశారు. పవార్ మృతిపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పారదర్శక దర్యాప్తు జరగాలని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ విజ్ఞప్తి చేశారు.


More Telugu News