కశ్మీర్ లో భారీ అవలాంచీ.. వీడియో ఇదిగో!

  • సోనామార్గ్‌లో మంగళవారం రాత్రి హిమపాతం
  • గందర్‌బల్ జిల్లాలోని రిసార్ట్‌ ను ముంచెత్తిన మంచు
  • జమ్మూ కశ్మీర్ ను వెంటాడుతున్న మంచు తుపాన్
జమ్మూ కశ్మీర్ లోని ఓ రిసార్ట్ ను భారీ అవలాంచీ ముంచెత్తింది. అలల్లాగా ఉవ్వెత్తున ఎగిసిపడ్డ మంచు.. రిసార్ట్ తో పాటు చుట్టుపక్కల భవనాలనూ కమ్మేసింది. మంగళవారం రాత్రి చోటుచేసుకున్న ఈ భయానక ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. జమ్మూ కశ్మీర్ ను వెంటాడుతున్న మంచు తుపాన్ కారణంగా ఈ అవలాంచీ ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఏకధాటిగా కురుస్తున్న మంచు ఒక్కసారిగా రిసార్ట్ ను ముంచెత్తిందని చెప్పారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వివరించారు.

జమ్మూ కశ్మీర్ లో దాదాపు అన్నిచోట్లా అత్యంత కఠిన వాతావరణం నెలకొంది. ఓవైపు మంచు విపరీతంగా కురుస్తుండడంతో పాటు.. మరోవైపు చలిగాలులు అక్కడి ప్రజలను వణికిస్తున్నాయి. శ్రీనగర్, గుల్మార్గ్, పహల్గామ్, అనంతనాగ్, కార్గిల్, సోన్‌మార్గ్, కుప్వారా, పుల్వామా, బేతాబ్ వ్యాలీ, పట్నిటాప్, పూంఛ్, కిష్టవార్.. ఇలా అన్నిచోట్లా హిమపాతం కురుస్తోంది. రోడ్ల మీద అడుగులకొద్దీ మంచు పేరుకుపోతోంది. చెట్లు, ఇళ్ల పైకప్పులపై దట్టంగా మంచు పేరుకుపోయింది. కాగా, ఉత్తరాఖండ్‌ లోని పలు ఎత్తైన ప్రాంతాలకు కూడా వాతావారణ శాఖ అధికారులు అవలాంచీ హెచ్చరికలు జారీ చేశారు. బద్రీనాథ్, కేదార్‌నాథ్‌ సహా పలు ప్రాంతాల్లో హిమపాతం కారణంగా ఈ హెచ్చరికలు జారీ చేశారు.


More Telugu News