విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

  • బారామతి వద్ద విమానం కూలి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి
  • ప్రమాదంలో పైలట్లు, భద్రతా సిబ్బంది సహా మొత్తం ఐదుగురి దుర్మరణం
  • ముంబై నుంచి బారామతి వెళ్తుండగా ల్యాండింగ్ సమయంలో ఘటన
  • స్థానిక సంస్థల ఎన్నికల సభలకు వెళ్తుండగా జరిగిన విషాదం
మహారాష్ట్రలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న చిన్న విమానం బారామతి సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు పైలట్లు, భద్రతా సిబ్బంది సహా మొత్తం ఐదుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు.

వివరాల్లోకి వెళితే.. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన నాలుగు బహిరంగ సభల్లో పాల్గొనేందుకు అజిత్ పవార్ ఈ ఉదయం ముంబై నుంచి బారామతికి బయలుదేరారు. ఉదయం 8 గంటలకు ముంబై నుంచి టేకాఫ్ తీసుకున్న విమానం, గంట తర్వాత బారామతి ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతుండగా ప్రమాదానికి గురైంది. విమానంలో ప్రయాణిస్తున్న ఐదుగురూ అక్కడికక్కడే మృతి చెందినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వర్గాలు ధ్రువీకరించాయి.

ప్రమాద స్థలంలో విమానం శకలాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మంటలు, దట్టమైన పొగలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే అంబులెన్సులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ హఠాత్పరిణామంతో మహారాష్ట్ర రాజకీయ వర్గాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి.


More Telugu News