హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో భారీగా ఇన్‌స్పెక్టర్ల బదిలీలు.. 46 మందికి స్థానచలనం

  • 32 మందికి కొత్త పోస్టింగులు ఇస్తూ సీపీ ఉత్తర్వులు
  • సీపీ కార్యాలయానికి మరో 14 మంది అధికారుల అటాచ్
  • నాంపల్లి, లాలాగూడ, టాస్క్‌ఫోర్స్‌కు కొత్త సీఐల నియామకం
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీ స్థాయిలో ఇన్‌స్పెక్టర్ల బదిలీలు జరిగాయి. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 46 మంది సర్కిల్ ఇన్‌స్పెక్టర్లను (సీఐ) బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీల్లో భాగంగా 32 మంది సీఐలకు కొత్త పోస్టింగ్‌లు కేటాయించారు.

పరిపాలనా సౌలభ్యం కోసం చేపట్టిన ఈ బదిలీల్లో చాలా కాలంగా సీపీ కార్యాలయంలో వెయిటింగ్‌లో ఉన్న పలువురు అధికారులకు పోస్టింగ్‌లు లభించాయి. మరో 14 మంది ఇన్‌స్పెక్టర్లను తక్షణమే సీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.

ఇక‌, సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)లో పనిచేస్తున్న సైదులును నాంపల్లి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌గా నియమించారు. వెయిటింగ్‌లో ఉన్న టి. అశోక్‌కుమార్‌ను లాలాగూడ పీఎస్ సీఐగా బదిలీ చేశారు. ఐటీ సెల్‌లో పనిచేస్తున్న జి. రాజేందర్ గౌడ్‌కు వారాసిగూడ, స్పెషల్ బ్రాంచ్‌లో ఉన్న ఎస్. రాఘవేంద్రకు మంగళ్‌హట్ బాధ్యతలు అప్పగించారు. గోషామహల్ ట్రాఫిక్‌లో ఉన్న జె. రాజశేఖర్‌ను కీలకమైన టాస్క్‌ఫోర్స్‌కు బదిలీ చేశారు. వెయిటింగ్‌లో ఉన్న ఇమ్యూనల్‌ను సుల్తాన్‌బజార్ ట్రాఫిక్‌కు, రాజును గోషామహల్ ట్రాఫిక్ సీఐగా నియమిస్తున్న‌ట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


More Telugu News