పదో తరగతి టాపర్‌కు 10 గ్రాముల బంగారం.. పారిశ్రామికవేత్త బంపరాఫర్

  • కృష్ణా జిల్లా ఉంగుటూరు జెడ్పీ స్కూల్‌లో వినూత్న ప్రోత్సాహం
  • 6 నుంచి 9వ తరగతి టాపర్లకూ బంగారు కానుకలు
  • పారిశ్రామికవేత్త గుత్తా సుమన్ కుమార్ ఉదార ప్రకటన
  • పాఠశాలకు లక్ష రూపాయల విలువైన క్రీడా సామాగ్రి విరాళం
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను ప్రోత్సహించే దిశగా ఓ పారిశ్రామికవేత్త వినూత్న బహుమతిని ప్రకటించారు. కృష్ణా జిల్లా ఉంగుటూరులోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వార్షిక పరీక్షల్లో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థికి 10 గ్రాముల బంగారం బహుమతిగా ఇవ్వనున్నట్టు పారిశ్రామికవేత్త గుత్తా సుమన్ కుమార్ వెల్లడించారు.

సుమన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉంగుటూరు మండలంలో నిర్వహించిన సేవా కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు. కేవలం పదో తరగతికే కాకుండా 6 నుంచి 9వ తరగతి వరకు చదివే విద్యార్థులకు కూడా ఆయన ప్రోత్సాహకాలు ప్రకటించారు. ఆయా తరగతుల్లో వార్షిక పరీక్షల్లో మొదటి స్థానం సాధించిన విద్యార్థులకు, వారు చదువుతున్న తరగతికి సమానంగా అన్ని గ్రాముల బంగారం అందిస్తానని హామీ ఇచ్చారు. 

ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంచి, వారిని చదువులో ప్రోత్సహించాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుమన్ కుమార్ వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలకు లక్ష రూపాయల విలువైన క్రీడా సామగ్రిని కూడా ఆయన అందజేశారు. సుమన్ కుమార్ సేవను గుర్తించిన ఎంఈవో సాంబశివరావు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆయన్ను ఘనంగా సత్కరించారు.


More Telugu News