బహిరంగ సభలో బయటపడ్డ వర్గపోరు.. డీకే అనుకూల నినాదాలపై సీఎం సిద్ధూ ఫైర్

  • బెంగళూరు సభలో సీఎం సిద్ధరామయ్య తీవ్ర ఆగ్రహం
  • డీకే శివకుమార్ అనుకూల నినాదాలతో హోరెత్తించిన మద్దతుదారులు
  • ఏఐసీసీ నేత సుర్జేవాలా సమక్షంలోనే ఘటన
  • ఇది అధికార పోరంటూ బీజేపీ విమర్శ
కర్ణాటక కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవి కోసం సాగుతున్న అంతర్గత పోరు మరోసారి బహిరంగంగా బయటపడింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బెంగళూరులో మంగళవారం నిర్వహించిన ఓ నిరసన సభలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మద్దతుదారులు చేసిన నినాదాలపై సీఎం సిద్ధరామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్రం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయడాన్ని నిరసిస్తూ ఈ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రసంగించేందుకు సీఎం సిద్ధరామయ్య మైక్ వద్దకు వెళ్లగా సభికుల్లో కొందరు 'డీకే, డీకే' అంటూ గట్టిగా నినాదాలు చేయడం ప్రారంభించారు. దీంతో సహనం కోల్పోయిన సిద్ధరామయ్య, నినాదాలు చేస్తున్న వారిని వెంటనే ఆపాలని గట్టిగా హెచ్చరించారు.

నినాదాలు మరింత పెరగడంతో "ఎవరు ఆ డీకే, డీకే అని అరిచేది?" అంటూ సీఎం అసహనం ప్రదర్శించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక ఇన్‌చార్జ్ రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా అక్కడే ఉన్న సమయంలో ఈ ఘటన జరగడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పరిణామంపై బీజేపీ నేత రోహన్ గుప్తా స్పందిస్తూ.. ఇది ప్రజా ఉద్యమం కాదని, కాంగ్రెస్‌లో అధికార కుర్చీ కోసం జరుగుతున్న పోరాటమని విమర్శించారు.

కర్ణాటకలో సీఎం పదవి పంపకాలపై సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వర్గాల మధ్య కొంతకాలంగా ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. శివరాత్రి పండుగ తర్వాత ఇరువురు నేతలను అధిష్ఠానం ఢిల్లీకి పిలిపించి చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని ఇద్దరు నేతలు ఇప్పటికే ప్రకటించారు.


More Telugu News