చుక్కలనంటిన బంగారం, వెండి ధరలు... ఆల్ టైమ్ రికార్డ్!

  • ఆల్ టైమ్ గరిష్ఠానికి చేరిన బంగారం, వెండి ధరలు
  • 10 గ్రాముల బంగారం ధర రూ.1.66 లక్షలు
  • కిలో వెండి ధర రూ.3.7 లక్షల మార్కును దాటిన వైనం
  • హైదరాబాద్‌లో రూ.3.87 లక్షలు పలికిన వెండి
  • అంతర్జాతీయ అనిశ్చితులతో సురక్షిత పెట్టుబడులపై పెరిగిన ఆసక్తి
దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మంగళవారం సరికొత్త చరిత్ర సృష్టించాయి. మునుపెన్నడూ లేని విధంగా జీవితకాల గరిష్ఠ స్థాయికి చేరి, మదుపరులను, వినియోగదారులను ఆశ్చర్యపరిచాయి. మంగళవారం ట్రేడింగ్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.1.66 లక్షలకు చేరగా, కిలో వెండి ధర ఏకంగా రూ.3.7 లక్షలు పలికింది.

వివరాల్లోకి వెళితే, సోమవారం ముగింపు ధర రూ.1,58,700తో పోలిస్తే, 10 గ్రాముల బంగారంపై ఒక్కరోజే రూ.7,300 (4.6 శాతం) పెరిగింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్‌)లో ఫిబ్రవరి ఫ్యూచర్స్ ట్రేడింగ్ సమయంలో రూ.1,59,820 వద్ద ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది.

బంగారం బాటలోనే వెండి కూడా పరుగులు పెట్టింది. ఎంసీఎక్స్‌లో మార్చి ఫ్యూచర్స్ కిలోకు రూ.3,64,000 మార్కును దాటగా, రిటైల్ మార్కెట్లో ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి. ముంబై, ఢిల్లీలలో కిలో వెండి ధర రూ.3.7 లక్షలు ఉండగా, హైదరాబాద్, చెన్నై వంటి నగరాల్లో ఇది రూ.3,87,000 వరకు పలికింది.

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి వల్లే ఈ ధరల పెరుగుదల చోటుచేసుకుందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడిదారులు బంగారం, వెండిని 'సేఫ్-హెవెన్' ఆస్తులుగా భావించి భారీగా కొనుగోలు చేస్తున్నారు. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 5,100 డాలర్ల రికార్డు స్థాయిని దాటడం కూడా దేశీయ ధరలపై ప్రభావం చూపింది. ఈ రికార్డు ధరలతో మార్కెట్లో తీవ్రమైన కదలికలు కనిపిస్తుండగా, మదుపరులు తదుపరి పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నారు.


More Telugu News