పాకిస్థాన్‌లోని లాహోర్ కోటలో 'లవుడి' ఆలయ పునరుద్ధరణ

  • లోహ్ అలయాన్ని పునరుద్ధరించినట్లు తెలిపిన డబ్ల్యుసీఎల్ఏ
  • లవ ఆలయంతో పాటు సిక్కుల కాలం నాటి స్మారక చిహ్నాల పునరుద్ధరణ
  • లాహోర్ కోట సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెప్పడంలో భాగంగా పునరుద్ధరణ
పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో గల చారిత్రక లాహోర్ కోటలో ఉన్న శ్రీరాముడి కుమారులలో ఒకరైన లవుడి ఆలయాన్ని (లోహ్ ఆలయం) పునరుద్ధరించి ప్రజల సందర్శనార్థం అందుబాటులోకి తెచ్చినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. లవ ఆలయాన్ని పూర్తిగా పునరుద్ధరించినట్లు వారు తెలిపారు. దీనితో పాటు సిక్కు కాలం నాటి పలు స్మారక చిహ్నాలను కూడా తెరిచినట్లు వాల్డ్ సిటీ లాహోర్ అథారిటీ (డబ్ల్యుసీఎల్ఏ) పేర్కొంది.

లవ ఆలయంతో పాటు పునరుద్ధరించిన వాటిలో సిక్కుల కాలం నాటి హమామ్, మహారాణా రంజిత్ సింగ్ అథ్ దారా పెవిలియన్ ఉన్నాయి. లవుడి పేరు మీదుగానే లాహోర్ పేరు వచ్చిందని హిందువులు విశ్వసిస్తారు. లవ ఆలయాన్ని 2018లో పాక్షికంగా పునరుద్ధరించారు.

లాహోర్ కోట సాంస్కృతిక వారసత్వాన్ని చాటిచెప్పడంలో భాగంగా అందులోని హిందూ, సిక్కు మందిరాలు, స్మారక చిహ్నాలు, మొఘలా కాలం నాటి నిర్మాణాలను పునరుద్ధరిస్తున్నట్లు వాల్డ్ సిటీ లాహోర్ అథారిటీ ప్రతినిధులు తెలిపారు. ఇందులో సిక్కుల కాలం నాటి 100 స్మారక చిహ్నాలు ఉండగా, ప్రస్తుతం 30 వరకు కనుమరుగైనట్లు అమెరికాకు చెందిన ఒక సిక్కు పరిశోధకుడు ఇటీవల తెలియజేశారు.


More Telugu News