జోగి రమేశ్ ను కలిసిన కేతిరెడ్డి... కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
- ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపుతున్నందుకు జోగి రమేశ్ ను జైల్లో పెట్టారన్న కేతిరెడ్డి
- ప్రభుత్వ తప్పిదాలపై రమేశ్ పోరాటం చేస్తూనే ఉంటారని వ్యాఖ్య
- తనపై ఉన్న కేసును కొట్టేయించుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని విమర్శ
మాజీ మంత్రి జోగి రమేశ్, ఆయన సోదరుడు జోగి రామును తప్పుడు కేసులతో అరెస్ట్ చేశారని వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈరోజు ఆయన జోగి రమేశ్ ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం తప్పులను ఎత్తిచూపుతున్నందుకు 83 రోజులు జైల్లో పెట్టారని, చంద్రబాబు సర్కార్ వచ్చిన తర్వాత తప్పుడు కేసులు పెట్టి అందరినీ ఇబ్బంది పెడుతోందని మండిపడ్డారు.
"జోగి రమేశ్ ను కలిసేందుకు ఆసుపత్రికి వెళ్లిన కుటుంబ సభ్యులపైనా కేసు పెట్టారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉందో అంతా చూస్తున్నారు. మర్డర్లు చేసిన వారిపై కేసు పెట్టడం లేదు. కోడిని, గొర్రెలను కోసిన వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారు. అక్రమంగా జైళ్లకు పంపిస్తే రెట్టించిన ఉత్సాహంతో మావాళ్లు పనిచేస్తారు. కూటమి ప్రభుత్వం తప్పిదాలపై జోగి రమేశ్ పోరాటం చేస్తూనే ఉంటారు" అని కేతిరెడ్డి అన్నారు.
"ధర్మవరంలో 70 శాతం కల్తీ మద్యం దొరుకుతోంది. కల్తీ మద్యం తయారు చేసేది నీ జిల్లా నుంచే చంద్రబాబు. బెల్టుషాపులు లేకుండా చేస్తానన్నావ్. కానీ ఇప్పుడు ఊరికి నాలుగు బెల్టు షాపులు ఉన్నాయి. వేలంపాటలో బెల్ట్ షాపులు పాడుకుంటున్నారు. గిట్టుబాటు కావడం కోసం కల్తీ మద్యం అమ్ముతున్నారు. కొన్ని రోజుల క్రితం కడప జిల్లాలో ఇద్దరు చనిపోయారు.
మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద తనపై ఉన్న కేసును కొట్టేయించుకోవాలని చంద్రబాబు చూస్తున్నాడు. చంద్రబాబుపై ఉన్న కేసులను మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని ఎలా తొలగిస్తున్నారు?" అని ప్రశ్నించారు.
"చట్టం అందరికీ ఒకటే. కేసులు తీసేయించుకోవాలని చూస్తున్న ప్రయత్నంపై అప్పీల్‌కు వెళతాం. మద్యం సీసాలపై క్యూఆర్ కోడ్ మేం అధికారంలో ఉన్నప్పుడే తెచ్చాం. మంచి మద్యం ఇస్తానని చంద్రబాబు చెబితే అందరూ ఈలలు వేశారు. మంచి విద్య, వైద్యం ఇస్తామని జగన్ చెప్పితే ఎవరూ చప్పట్లు కొట్టలేదు. నేను ఇది చేశానని చెప్పి గడప గడపకు వెళ్లాలంటే ధైర్యం కావాలి. జగన్ ఎమ్మెల్యేలందరినీ ప్రజల ఇళ్ల వద్దకు పంపించారు. నాపై ఆరోపణలకు ఎందుకు ఆధారాలు చూపలేకపోతున్నారు. చేతనైతే వాటిపై చర్యలు తీసుకోండి" అని సవాల్ విసిరారు.
"తిరుపతి లడ్డూలో పందికొవ్వు కలిపారని సీఎం, డిప్యూటీ సీఎం ప్రచారం చేశారు. ఈ రోజు లడ్డూలో అలాంటిదేమీ లేదని తేలింది. తాము ఒకటి చేయాలనుకుంటే మరొకటి జరిగిందని కూటమి నేతలు బాధపడుతున్నారు. ఇలాంటి దుష్ప్రచారాలు చేసేవాడు హిందూమతాన్ని కాపాడతాడా? నకిలీ మద్యం విషయంలో తప్పుడు ఆధారాలతో బురదజల్లారు. దీనిపై లీగల్‌గా ఫైట్ చేస్తాం. మమ్మల్ని ఇబ్బంది పెట్టినవారిని ఎవరినీ వదలం" అని హెచ్చరించారు.