ఒంటినిండా విషం నింపుకుని కాంగ్రెస్ పట్ల విషం చిమ్ముతున్నారు: పొంగులేటి శ్రీనివాసరెడ్డి

  • బీఆర్ఎస్ నేతలపై పొంగులేటి ఫైర్
  • అధికారం కోల్పోయిన తర్వాత అచ్చోసిన ఆంబోతుల్లా రంకెలు వేస్తున్నారని మండిపాటు
  • తమ ప్రభుత్వం ప్రజల కోసమే పని చేస్తోందన్న మంత్రి

బీఆర్ఎస్ నేతలు అధికారం కోల్పోయిన తర్వాత అచ్చోసిన ఆంబోతుల్లా రంకెలు వేస్తూ, ఒంటినిండా విషం నింపుకుని కాంగ్రెస్ పట్ల విషం చిమ్ముతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజల శ్రేయస్సు కోసం ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందన్నారు. గత ప్రభుత్వంలో రూపొందిన మంచి పథకాలను కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నామని వివరించారు. రాబోయే ఏప్రిల్ నెలలో మళ్లీ కొత్త ఇళ్లు మంజూరు చేస్తామని, ఆ తర్వాత మరో మూడు దఫాలుగా ఇళ్లు మంజూరీ చేస్తామని ప్రకటించారు.


ప్రజలు గతంలో ఏం జరిగిందో గుర్తుంచుకోవాలని, ప్రస్తుత ప్రభుత్వం ప్రజల కోసమే పని చేస్తోందని స్పష్టం చేశారు.


వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కోరిక మేరకు నియోజకవర్గానికి రూ.1.30 కోట్ల నిధులు మంజూరు చేశానని ఎంపీ కడియం కావ్య స్పష్టం చేశారు. నియోజకవర్గ కేంద్ర అభివృద్ధికి తనవంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆమె అన్నారు.


ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ, వర్ధన్నపేటలో మూడుసార్లు ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా పని చేసిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఎవరినీ ఎదగనీయకుండా ధృతరాష్ట్రుని పాలన చేశాడని విమర్శించారు. పాలకుర్తిలో ప్రజలు తరిమికొట్టిన తర్వాత ఇప్పుడు వర్ధన్నపేట మునిసిపాలిటీపై అవాకులు, చవాకులు పేలుతున్నారని దుయ్యబట్టారు.



More Telugu News