నేడు దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె... స్తంభించిన సేవలు

  • వారానికి 5 రోజుల పనిదినాల కోసం దేశవ్యాప్త సమ్మె
  • ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్
  • యూఎఫ్‌బీయూ పిలుపుతో నిరసన బాట పట్టిన ఉద్యోగులు
వారానికి ఐదు రోజుల పనిదినాలు అమలు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు మంగళవారం సమ్మెకు దిగారు. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) పిలుపు మేరకు జరిగిన ఈ సమ్మెతో బ్యాంకింగ్ సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. నగదు డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్, చెక్కు క్లియరెన్సులు వంటి రోజువారీ లావాదేవీలు నిలిచిపోవడంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

దేశంలోని దాదాపు అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. గుజరాత్‌లోని వడోదర, పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌బెహార్, ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్, ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ సహా అనేక నగరాల్లో ఉద్యోగులు పెద్ద సంఖ్యలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఐదు రోజుల పని విధానం కోసం ప్రభుత్వానికి చాలాసార్లు వినతిపత్రాలు సమర్పించినా ఎలాంటి స్పందన లేకపోవడంతో సమ్మెబాట పట్టాల్సి వచ్చిందని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు.

"ఈరోజు సమ్మెలో దేశవ్యాప్తంగా 8 లక్షల మందికి పైగా ఉద్యోగులు పాల్గొంటున్నారు. 2015 నుంచి మా డిమాండ్ పెండింగ్‌లోనే ఉంది. ఎల్ఐసీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఇప్పటికే వారానికి 5 రోజుల పనివిధానం అమలవుతోంది. బ్యాంకుల్లోనూ అమలు చేస్తామని హామీ ఇచ్చినా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు" అని ఓ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు.

ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)తో జరిగిన ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా ఆరు నెలల్లోనే 5 రోజుల పనిదినాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారని, కానీ రెండేళ్లు గడిచినా ఆ హామీ నెరవేరలేదని పాట్నాలో ఉద్యోగులు తెలిపారు. "ఆర్‌బీఐ, నాబార్డ్, సెబీ వంటి సంస్థలన్నీ 5 రోజులే పనిచేస్తున్నాయి. మాకు మాత్రం ఎందుకు అమలు చేయడం లేదు?" అని వారు ప్రశ్నించారు. 

యూపీలోని ఘాజీపూర్ జిల్లాలో దాదాపు 250 బ్యాంకులకు చెందిన 10,000 మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడంతో సుమారు రూ.150 కోట్ల విలువైన లావాదేవీలు నిలిచిపోయాయి. ప్రభుత్వ హామీ నెరవేరే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి.


More Telugu News