కెనడా సూపర్ పవర్ కావాలంటే..!: భారత్‌తో సంబంధాలపై కెనడా మంత్రి కీలక వ్యాఖ్యలు

  • అత్యంత కీలకమైన ఇంధన మార్కెట్‌లలో ఒకటిగా భారత్ అభివృద్ధి చెందుతోందని వ్యాఖ్య
  • కెనడా సూపర్ పవర్ కావాలంటే భారత్‌తో వ్యాపారం చేయాలన్న మంత్రి టిమ్ హాడ్గ్‌సన్
  • ముడిచమురు, సహజ వాయువుల రవాణాకు కెనడా సిద్ధంగా ఉందన్న ఆ దేశ మంత్రి
భారత పర్యటనలో ఉన్న కెనడా ఇంధన, సహజ వనరుల మంత్రి టిమ్ హాడ్గ్‌సన్ ఇరు దేశాల మధ్య వ్యాపార సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఇంధన మార్కెట్‌లలో ఒకటిగా ఎదుగతోందని, ఈ నేపథ్యంలో ఇంధన రంగంలో కెనడా అగ్రగామిగా నిలవాలంటే భారత్‌తో వ్యాపారం చేయడం ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

గోవాలో జరుగుతున్న భారత ఇంధన వారోత్సవాలకు కెనడా మంత్రి టిమ్ హాడ్గ్‌సన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇరు దేశాల ఇంధన సహకారానికి ఈ వారోత్సవాలు ఒక మంచి వేదికని అన్నారు. భారత్, కెనడా మధ్య వాణిజ్య సంబంధాలను, ఇంధన వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

చమురు, గ్యాస్ వాణిజ్యాన్ని విస్తరించడానికి ఒట్టావా నుంచి భారత్‌కు ముడిచమురు, పెట్రోలియం, సహజ వాయువులను రవాణా చేయడానికి కెనడా సంసిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. అంతకుముందు టిమ్ హాడ్గ్‌సన్ 'ఎక్స్' వేదికగా తన భారత పర్యటన గురించి స్పందిస్తూ, భారత్‌లో జరుగుతున్న ఇంధన వారోత్సవాల్లో పాల్గొనడం తన తొలి పర్యటన అని పేర్కొన్నారు.

కాగా, వాణిజ్యం, కీలక ఖనిజాలు, ఇంధనం తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించే దిశగా భారత్, కెనడా అడుగులు వేస్తున్నాయి. ఇందులో భాగంగా వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయి. కెనడా వాణిజ్య మంత్రితో చర్చల అనంతరం భారత పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి మాట్లాడుతూ, ఇరు దేశాల మధ్య పలు వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.

హైడ్రోజన్, బయో ఇంధనాలు, బ్యాటరీ నిల్వ, కీలకమైన ఖనిజాలు, విద్యుత్ వ్యవస్థలు, ఇంధన పరిశ్రమలో కృత్రిమ మేధస్సు వినియోగం వంటి అంశాలపై దృష్టి సారించినట్లు ఆయన వెల్లడించారు. 2050 నాటికి ప్రపంచ ఇంధన డిమాండ్‌లో భారత్ వాటా 30 శాతం నుంచి 35 శాతానికి పెరుగుతుందని అంచనా వేయగా, తద్వారా భారత్ మూడవ అతిపెద్ద ఇంధన మార్కెట్‌గా అవతరిస్తుందని ఆయన అన్నారు.


More Telugu News