Komatireddy Venkat Reddy: తెలంగాణ వచ్చిన తొలి పదేళ్లలో ప్రజల సమస్యలు తీరలేదు: కోమటిరెడ్డి

Komatireddy Telangana problems not solved even after 10 years
  • తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన పాఠశాలను ప్రారంభించిన కోమటిరెడ్డి
  • సరైన విద్య అందితేనే పేదల సమస్యలు తీరుతాయన్న మంత్రి
  • విద్యార్థులకు స్కిల్స్ లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్య

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తొలి 10 ఏళ్లలో ప్రజల సమస్యలు తీరలేదని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. నల్లొండలోని బొట్టుగూడలో ‘కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్’ ఆధ్వర్యంలో రూ.8 కోట్ల వ్యయంతో నిర్మించిన పాఠశాలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.


పాఠశాల ప్రారంభోత్సవ వేదికపై కోమటిరెడ్డి మాట్లాడుతూ... "సరైన విద్య అందితేనే పేదల సమస్యలు తొలగుతాయి. ప్రభుత్వం ఏటా వేల కోట్లు విద్యపై ఖర్చు చేస్తోంది. కానీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తొలి పదేళ్లలో మన సమస్యలు తీరలేదు" అని అన్నారు. బొట్టుగూడ స్కూల్‌ను ఒక మోడల్ స్కూల్‌గా తీర్చిదిద్దుతామని, దేశంలో ఎక్కడా ఇలాంటి ప్రభుత్వ పాఠశాల లేదని, మరెక్కడా కనిపించదని ఆయన గర్వంగా చెప్పారు.


స్కూల్‌లో కంప్యూటర్లు, డిజిటల్ బోర్డులు, క్రీడా సదుపాయాలు కల్పించామని వివరించారు. అయితే, విద్యార్థులకు మార్కులు బాగా వస్తున్నా... ఉద్యోగాల సమయంలో అవసరమైన నైపుణ్యాలు (స్కిల్స్) లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. "మన విద్యార్థులు మార్కుల్లో ముందుంటారు. కానీ స్కిల్స్ లేకపోతే ఉద్యోగాలు రావు. ఈ విషయంపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి పెట్టాలి" అని సూచించారు.


ఈ సందర్భంగా మంత్రి విద్యార్థులతో సంభాషించారు, టీచర్లతో చర్చించారు. బొట్టుగూడ స్కూల్‌ను రాష్ట్రంలోనే అత్యుత్తమ మోడల్ స్కూల్‌గా తీర్చిదిద్దాలని అన్నారు.

Komatireddy Venkat Reddy
Telangana
Telangana formation day
Nalgonda
Bottuguda school
Education
Skills development
Telangana government
Model school
Komati Reddy Prateek Reddy Foundation

More Telugu News