Mohan Babu: రిపబ్లిక్ డే సందర్భంగా మోహన్ బాబుకు అరుదైన గౌరవం
- పశ్చిమ బెంగాల్ గవర్నర్ చేతుల మీదుగా 'గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డు'ను అందుకున్న మోహన్ బాబు
- ఎట్ హోం రిసెప్షన్ లో కూడా పాల్గొన్న కలెక్షన్ కింగ్
- మోహన్ బాబుకు అభినందనలు తెలియజేస్తున్న సినీ ప్రముఖులు
తెలుగు సినిమాలో కలెక్షన్ కింగ్‌గా పేరు తెచ్చుకున్న లెజెండరీ నటుడు మోహన్ బాబుకు అరుదైన గౌరవం దక్కింది. 77వ రిపబ్లిక్ డే సందర్భంగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీ.వి. ఆనంద్ బోస్ చేతుల మీదుగా 'గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డు'ను ఆయన అందుకున్నారు. తెలుగు నటుడికి ఈ అవార్డు దక్కడం ఇదే తొలిసారి కావడం విశేషం.
కోల్‌కతాలోని లోక్ భవన్‌లో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో మోహన్ బాబు ఈ అవార్డును అందుకున్నారు. అనంతరం జరిగిన 'ఎట్ హోం' రిసెప్షన్‌లో కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫొటోల్లో మోహన్ బాబు వెంట మంచు విష్ణు, నటుడు శివబాలాజీలు కూడా కనిపిస్తున్నారు.
మోహన్ బాబు దాదాపు 50 సంవత్సరాలకు పైగా తెలుగు సినీ పరిశ్రమలో విలన్, హీరో, తండ్రి పాత్రల్లో అదరగొట్టారు. 'కలెక్షన్ కింగ్'గా ప్రసిద్ధి చెందిన ఆయన, అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. తన సొంత బ్యానర్ పై ఎన్నో చిత్రాలను నిర్మించారు. సినిమాలతో పాటు సామాజిక సేవల్లో కూడా ముందుండి... పేద విద్యార్థులకు ఉచిత విద్య, స్కాలర్‌షిప్‌లు అందిస్తూ ఎంతో మందికి సహాయం చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఈ అవార్డు దక్కడం తెలుగు సినీ పరిశ్రమకు, సామాజిక సేవకులకు గర్వకారణంగా నిలిచింది.
సినీ ప్రముఖులు ఈ అవార్డును ఘనంగా స్వాగతించారు. "మోహన్ బాబుకి ఈ గౌరవం దక్కడం చాలా సంతోషంగా ఉంది" అంటూ పలువురు నటీనటులు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపించారు.