EU-India Deal: ఢిల్లీలో చారిత్రక ఘట్టం.. భారత్-ఈయూ 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్' ఖరారు

Ursula von der Leyen Announces India EU Free Trade Agreement
  • భారత్, యూరప్‌ సమాఖ్య మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారు
  • 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్'గా అభివర్ణించిన ఈయూ కమిషన్ అధ్యక్షురాలు
  • 18 ఏళ్ల సుదీర్ఘ చర్చల తర్వాత తుది రూపం
  • భారత్ నుంచి 97 శాతం ఎగుమతులపై సుంకాల రద్దు
  • వచ్చే ఏడాది నుంచి ఒప్పందం అమల్లోకి వచ్చే అవకాశం
భారత్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) ఖరారైంది. 18 ఏళ్ల సుదీర్ఘ చర్చల తర్వాత కుదిరిన ఈ ఒప్పందాన్ని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్'గా అభివర్ణించారు. ఈరోజు న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, ఈయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా, కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టాలతో జరిగిన 16వ శిఖరాగ్ర సమావేశంలో ఈ ఒప్పందాన్ని అధికారికంగా ఖరారు చేశారు.

ఈ ఒప్పందం ద్వారా భారత్ నుంచి జరిగే 97 శాతం ఎగుమతులపై సుంకాలు రద్దు కానున్నాయి. ముఖ్యంగా టెక్స్‌టైల్స్, రత్నాలు, లెదర్ వంటి రంగాలకు ఇది భారీ ఊతాన్ని ఇవ్వనుంది. అదే సమయంలో యూర‌ప్‌ కార్లు, యంత్ర పరికరాలకు భారత మార్కెట్‌లోకి ప్రవేశం సులభతరం అవుతుంది. "ఈరోజు యూర‌ప్‌, భారత్ చరిత్ర సృష్టిస్తున్నాయి. మేం 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్'ను ముగించాం. ఇరుపక్షాలకు ప్రయోజనం చేకూర్చేలా 200 కోట్ల మంది ప్రజలతో స్వేచ్ఛా వాణిజ్య క్షేత్రాన్ని సృష్టించాం" అని ఉర్సులా 'ఎక్స్' వేదికగా తెలిపారు.

ఈ ఒప్పందం రెండు ప్రపంచ దిగ్గజాల మధ్య భాగస్వామ్యానికి చక్కటి ఉదాహరణ అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. వాణిజ్యంతో పాటు రక్షణ, భద్రత, వాతావరణ మార్పులు, కీలక సాంకేతికతలు వంటి అంశాలపై కూడా ఇరుపక్షాలు దృష్టి సారించాయి. అమెరికా, చైనాలపై ఆధారపడటాన్ని తగ్గించుకుని, ఇతర ప్రాంతాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని చూస్తున్న ఐరోపాకు ఈ ఒప్పందం వ్యూహాత్మకంగా చాలా కీలకం. ఈ ఒప్పందం వచ్చే ఏడాది నుంచి అమల్లోకి వస్తుందని అంచనా వేస్తున్నారు.
EU-India Deal
Ursula von der Leyen
India EU FTA
India European Union
Free Trade Agreement
Narendra Modi
Trade Deal
European Commission
India trade
EU trade
Hyderabad House

More Telugu News