Jana Nayagan: విజయ్ 'జన నాయగన్'కు షాక్... మళ్లీ మొదటికొచ్చిన సెన్సార్ వివాదం

Vijay Jana Nayagan faces setback Madras High Court cancels censor certificate order
  • విజయ్ 'జన నాయగన్' సినిమాకు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ
  • సింగిల్ బెంచ్ తీర్పును కొట్టివేసిన డివిజన్ బెంచ్
  • సెన్సార్ బోర్డుకు కౌంటర్ దాఖలుకు సమయం ఇవ్వాలన్న హైకోర్టు
  • మరింత ఆలస్యం కానున్న సినిమా విడుదల
దళపతి విజయ్ హీరోగా నటించిన 'జన నాయగన్' సినిమాకు మద్రాస్ హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయాలంటూ గతంలో సింగిల్ బెంచ్‌ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ ఇవాళ‌ కొట్టివేసింది. దీంతో సినిమా విడుదల మరింత ఆలస్యం కావడం ఖాయంగా కనిపిస్తోంది.

సెన్సార్ బోర్డు తన వాదనలు వినిపించడానికి (కౌంటర్ దాఖలు చేయడానికి) సింగిల్ జడ్జి తగిన సమయం ఇవ్వలేదని డివిజన్ బెంచ్ అభిప్రాయపడింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుంచి క్లియరెన్స్ వస్తేనే 'జన నాయగన్' థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టులో ఈ కేసుపై తాజాగా విచారణ ప్రారంభం కానుంది.

విజయ్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రాకముందు నటించిన చివరి చిత్రంగా ప్రచారం జరుగుతున్న 'జన నాయగన్', సంక్రాంతి సందర్భంగా ఈ నెల‌ 9న విడుదల కావాల్సి ఉంది. అయితే, ఓ ఫిర్యాదు ఆధారంగా సినిమాను రివైజింగ్ కమిటీకి పంపినట్లు సెన్సార్ బోర్డు నిర్మాతలకు తెలిపింది. దీంతో నిర్మాతలు కేవీఎన్ ప్రొడక్షన్స్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా, మార్పుల తర్వాత సినిమాకు 'యూ/ఏ' సర్టిఫికెట్ ఇవ్వాలని సింగిల్ బెంచ్ ఆదేశించింది. ఈ తీర్పుపై సెన్సార్ బోర్డు అప్పీల్ చేయడంతో డివిజన్ బెంచ్ స్టే విధించింది. నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించినా, తిరిగి హైకోర్టునే సంప్రదించాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది.

హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా, బాబీ డియోల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాశ్‌ రాజ్, నరైన్, ప్రియమణి కీలక పాత్రలు పోషించారు.
Jana Nayagan
Vijay
Vijay film
Madras High Court
Censor Board
KVN Productions
Pooja Hegde
H Vinoth
movie release
Tamil cinema

More Telugu News