PCB: పాక్ టీ20 ప్రపంచకప్‌ను బహిష్కరిస్తే.. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టే!

Why Pakistan Cant Afford to Boycott T20 World Cup 2026
  • బంగ్లాదేశ్‌కు మద్దతుగా టీ20 ప్రపంచకప్‌ను బహిష్కరించే ఆలోచనలో పాక్‌
  • బాయ్‌కాట్ చేస్తే ఐసీసీ నుంచి రావాల్సిన రూ.316 కోట్ల ఆదాయం కోల్పోయే ప్రమాదం
  • పాక్ బోర్డుపై సస్పెన్షన్, ఆతిథ్య హక్కుల రద్దు వంటి కఠిన ఆంక్షల హెచ్చరిక
  • ప్రపంచకప్‌లో పాల్గొనడంపై తుది నిర్ణయం పాక్ ప్రభుత్వానిదేనన్న పీసీబీ
క్రికెట్ ప్రపంచంలో మరో వివాదానికి తెరలేచే సూచనలు కనిపిస్తున్నాయి. త్వ‌ర‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌ను బహిష్కరించే (బాయ్‌కాట్) దిశగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆలోచిస్తున్న‌ట్లు స‌మాచారం. భారత్‌లో పర్యటించేందుకు బంగ్లాదేశ్ నిరాకరించడంతో ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్‌ను ఐసీసీ ఎంపిక చేసింది. దీనికి నిరసనగా బంగ్లాకు సంఘీభావం తెలుపుతూ పాకిస్థాన్ ఈ కఠిన నిర్ణయం తీసుకునే యోచనలో ఉంది. సోమవారం పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో సమావేశమైనప్పటికీ తుది నిర్ణయాన్ని వారం చివరికి వాయిదా వేశారు.

అయితే, రాజకీయ కారణాలతో టోర్నీని బహిష్కరించడం పాకిస్థాన్ క్రికెట్‌కు మంచిది కాద‌ని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో తుది నిర్ణయం ప్రభుత్వానిదేనని పీసీబీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఒకవేళ పాకిస్థాన్ ఈ టోర్నీ నుంచి తప్పుకుంటే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఐసీసీతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం చివరి నిమిషంలో వైదొలగడం నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుంది. దీనివల్ల ఐసీసీ నుంచి ఏటా అందే 34.5 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 316 కోట్లు) ఆదాయాన్ని పాకిస్థాన్ కోల్పోవాల్సి వస్తుంది. ఇది ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పీసీబీని మరింత సంక్షోభంలోకి నెడుతుంది.

అంతేగాక‌ ప్రభుత్వ జోక్యం కారణంగా ఐసీసీ కఠిన ఆంక్షలు విధించే ప్రమాదం ఉంది. గతంలో జింబాబ్వే, శ్రీలంక బోర్డులపై విధించినట్టుగా సస్పెన్షన్ వేటు వేయవచ్చు. దీనివల్ల భవిష్యత్తులో ఆసియా కప్ వంటి టోర్నీలకు దూరం కావడమే కాకుండా 2028 మహిళల టీ20 ప్రపంచకప్ ఆతిథ్య హక్కులను కూడా కోల్పోవచ్చు. ఈ నిర్ణయం పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)పైనా తీవ్ర ప్రభావం చూపుతుంది. విదేశీ ఆటగాళ్లకు వారి దేశాల బోర్డులు నిరభ్యంతర పత్రాలు (ఎన్ఓసీలు) నిరాకరిస్తే, పీఎస్‌ఎల్ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది. ఈ పరిణామాలన్నీ పాకిస్థాన్ క్రికెట్‌ను ప్రపంచంలో ఏకాకిని చేసే ప్రమాదం ఉంది. బంగ్లాదేశ్‌కు మద్దతు తెలపడం ఒక ఎత్తయితే, దాని కోసం ఇంత భారీ మూల్యం చెల్లించుకోవడం సరికాదని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు.
PCB
Mohsin Naqvi
T20 World Cup
Pakistan Cricket Board
ICC
Pakistan Super League
PSL
Bangladesh
Cricket
Boycott

More Telugu News