సీఎం లేకుండా మంత్రుల సమావేశంపై మహేశ్ గౌడ్ క్లారిటీ

  • సీఎం విదేశాల్లో ఉన్న సమయంలో పరిపాలన అంశాలపై మంత్రులు సమావేశం కావడంలో తప్పేమీ లేదన్న మహేశ్ కుమార్ గౌడ్
  • విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై పార్టీ అధిష్ఠానంతో సమగ్రంగా చర్చిస్తామని వెల్లడి 
  • గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన అవకతవకలపై తప్పనిసరిగా విచారణ జరగాలన్న మహేశ్ కుమార్ గౌడ్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులతో సమావేశం నిర్వహించడంపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టతనిచ్చారు. ముఖ్యమంత్రి విదేశాల్లో ఉన్న సమయంలో పరిపాలన అంశాలపై మంత్రులు సమావేశం కావడంలో తప్పేమీ లేదని ఆయన అన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి రాష్ట్ర పరిపాలన విషయమై సమావేశం నిర్వహించి ఉంటారని తాము భావిస్తున్నామని చెప్పారు.

ఢిల్లీలో నిన్న కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో పీసీసీ అధ్యక్షుల సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం మహేశ్‌కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై పార్టీ అధిష్ఠానంతో సమగ్రంగా చర్చిస్తామని తెలిపారు.

అదే క్రమంలో బీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పించారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన అవకతవకలపై తప్పనిసరిగా విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ నోటీసులు జారీ చేయాలని, ఈ వ్యవహారంలో పూర్తిస్థాయి దర్యాప్తు జరగాలని కోరారు.

కాంగ్రెస్‌లోకి కవిత రావడంపై గతంలోనే తన అభిప్రాయం స్పష్టం చేశానని, ఆమె తమ పార్టీలోకి అవసరం లేదన్న మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని తెలిపారు. హరీశ్‌రావు, కేటీఆర్ హయాంలో కొందరికి లబ్ధి చేకూర్చేందుకే కాంట్రాక్టులు కేటాయించారని ఆరోపించారు. ఈ విషయాన్ని కవితే స్వయంగా వెల్లడించారని మహేశ్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు. 


More Telugu News