Indian Immigrants: అక్రమ ప్రవేశాలు.. గతేడాది యూఎస్ సరిహద్దుల్లో ప్రతి 20 నిమిషాలకు ఒక భారతీయుడి అరెస్ట్!

Indian Immigrants Arrested Every 20 Minutes at US Border
  • యూఎస్ సరిహద్దుల్లో కలవరపరిచే గణాంకాలు
  • 2025లో అక్రమంగా ప్రవేశిస్తూ ప‌ట్టుబ‌డ్డ‌ 23,830 మంది 
  • 2024లో 85 వేల అరెస్టులతో పోలిస్తే ఇది చాలా తక్కువే
  • ఉద్యోగ, వీసా సమస్యలే ప్రధాన కారణాలని విశ్లేషణ
ఉన్నత చదువులు, మెరుగైన ఉద్యోగాల కోసం అమెరికాకు వెళ్లే భారతీయులకు సంబంధించిన ఓ ఆందోళనకర నివేదిక వెలుగులోకి వచ్చింది. గ‌తేడాది అమెరికా సరిహద్దుల్లో ప్రతి 20 నిమిషాలకు ఒక భారతీయ పౌరుడిని అరెస్ట్ చేసినట్లు అధికారిక గణాంకాలు తెలుపుతున్నాయి.

యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విడుదల చేసిన డేటా ప్రకారం 2025లో సరైన పత్రాలు లేకుండా లేదా అక్రమంగా దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన 23,830 మంది భారతీయులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఖ్య ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ అంతకుముందు ఏడాదితో పోలిస్తే మాత్రం అరెస్టుల సంఖ్య గణనీయంగా తగ్గిందని అధికారులు తెలిపారు. 2024లో ఈ సంఖ్య 85,000గా ఉండటం గమనార్హం.

అమెరికా ప్రభుత్వం కఠినతరం చేసిన వలస విధానాలు, పెరిగిన అవగాహన, సరిహద్దుల్లో నిఘా పెంపుదల వంటి కారణాల వల్లే అరెస్టుల సంఖ్య తగ్గిందని అధికారులు విశ్లేషిస్తున్నారు. మొత్తంగా చూస్తే, 2025లో అమెరికా సరిహద్దుల్లో వివిధ దేశాలకు చెందిన 3.91 లక్షల మందిని అరెస్ట్ చేయగా, అందులో భారతీయులు కూడా ముఖ్యమైన సంఖ్యలో ఉన్నారు. కెనడా, మెక్సికో సరిహద్దుల గుండా అక్రమంగా ప్రవేశించేందుకు ఎక్కువ మంది ప్రయత్నిస్తున్నారు.

ఉద్యోగావకాశాలు, విద్యార్థి వీసాల్లో సమస్యలు, వలస ప్రక్రియలో తీవ్ర జాప్యం వంటి కారణాలతో చాలామంది ఇలాంటి ప్రమాదకర మార్గాలను ఎంచుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు. అయితే, అక్రమంగా దేశంలోకి ప్రవేశించడం తీవ్రమైన నేరమని, పట్టుబడితే నిర్బంధంతో పాటు దేశ బహిష్కరణ వంటి తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని యూఎస్ అధికారులు హెచ్చరిస్తున్నారు. సురక్షితమైన, చట్టబద్ధమైన మార్గాల్లో వలసలు సాగించాల్సిన అవసరాన్ని ఈ గణాంకాలు మరోసారి స్పష్టం చేస్తున్నాయి.
Indian Immigrants
US Border
illegal immigration
arrests
US Customs and Border Protection
immigration policy
student visas
employment opportunities
Canada border
Mexico border

More Telugu News